Pushpa 3: పుష్ప 3 ఐటమ్ సాంగ్‌కు ఆ హీరోయిన్ బెస్ట్.. మనసులో మాట చెప్పిన దేవిశ్రీ ప్రసాద్
Pushpa 3: కమర్షియల్ సినిమా అంటే ఐటం సాంగ్ ఉండాల్సిందే. స్పెషల్ సాంగ్ లేని కమర్షియల్ సినిమాను ఊహించుకోవడం కష్టమే.
Pushpa 3: కమర్షియల్ సినిమా అంటే ఐటం సాంగ్ ఉండాల్సిందే. స్పెషల్ సాంగ్ లేని కమర్షియల్ సినిమాను ఊహించుకోవడం కష్టమే. సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చిందంటే చాలు.. ఆ ఊపే వేరు. పుష్ప సిరీస్‌లో ఊ అంటావా, కిస్సిక్ స్పెషల్ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. పుష్పలో సమంత, పుష్ప2లో శ్రీలీల ఐటం సాంగ్‌లో తమ డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించారు. ఇక పుష్ప3లో ఐటెమ్ సాంగ్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారా అనే చర్చ మొదలైంది.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప3 ఐటెమ్ సాంగ్ కోసం ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే విషయాన్ని దేవిశ్రీప్రసాద్ పంచుకున్నారు. పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు.
పుష్ప2లోని కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని తమకు ముందే తెలుసునన్నారు. శ్రీలీల అద్బుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు చెప్పాను. ఎంతోమంది అగ్రకథానాయికలు మొదటిసారి తన కంపోజిషన్‌లోనే ప్రత్యేక గీతాల్లో అలరించారని అన్నారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ వీళ్లంతా అగ్రస్థానంలో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్‌లో నటించారని చెప్పారు.
ఇక పుష్ప3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేవారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై దర్శక, నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాట ఆధారంగా హీరోయిన్‌ను ఎంపిక చేస్తారని.. మంచి డ్యాన్సర్ అయితే బాగుంటుందని అన్నారు. సాయి పల్లవి డ్యాన్సుకు తాను అభిమానినన్నారు. అలాగే జాన్వీ కపూర్ అద్బుతమైన డ్యాన్సర్ అని చెప్పారు. ఆమె పాటలు కొన్ని చూశానని.. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో ఉందని అన్నారు. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి పాటలు హిట్ కావడానికి డ్యాన్స్ కూడా ముఖ్య కారణం అని దేవీశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ కాంబినేషన్లో 2021లో విడుదలైన పుష్ప సినిమా సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప2ను తెరకెక్కించారు. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప2.. రూ.2000 కోట్లకు చేరువలో ఉంది. ఇక ఇటీవల అదనంగా 20 నిమిషాల నిడివిని జోడించారు. ఇక పుష్ప2కు కొనసాగింపుగా పుష్ప3 సిద్దం కానుంది.