Sivasankar Master: మగధీర' పాటకు 22 రోజులు.. 'అరుంధతి' పాటకు 32 రోజులు!

* 'అరుంధతి' కోసం 32 రోజులు * 'ధీర ధీర' పాట పూర్తి చేయడానికి 22 రోజులు పట్టిందట.

Update: 2021-11-29 03:13 GMT

శివశంకర్‌ మాస్టర్(ఫైల్ ఫోటో)

Sivasankar Master: డ్యూయెట్‌లు, మాస్‌ సాంగ్‌లకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేయటం కాస్త సులభమే. అయితే, కొన్ని ప్రత్యేక పాటలకు నృత్యాలు సమకూర్చాలంటే అందులో ఎంతో అనుభవం ఉండాలి. డ్యాన్స్‌పై పట్టు ఉండాలి. పాట వెనుక అర్థం తెలిస్తేనే పాదం సరైన రీతిలో కదులుతుంది. అలాంటి వైవిధ్యమైన పాటకు నృత్యాలు సమకూర్చి మన్నలను పొందిన కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌. అందుకే జాతీయ అవార్డు సైతం ఆయన డ్యాన్స్‌కు కదిలి వచ్చింది.

అయితే, తన కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాలు రెండు ఉన్నాయని శివ శంకర్‌ మాస్టర్‌ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ రెండూ తెలుగు చిత్రాలు కావటం గమనార్హం. అందులో ఒకటి అనుష్క నటించిన 'అరుంధతి' ఒకటి కాగా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటించిన 'మగధీర' రెండోది. కరోనాతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు చిత్రాల్లోని పాటలకు ఆయన శ్రమించిన విధానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..

'అరుంధతి' కోసం 32 రోజులు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క టైటిల్‌ రోల్‌ పోషించిన సినిమా 'అరుంధతి'. 2009లో వచ్చిన ఈ చిత్ర బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జేజేమ్మగా అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయితే, పశుపతిగా సోనూసూద్‌ నటన చూసి భయపడిపోయారు.

క్షుద్రమాంత్రికుడైన సోనూసూద్‌ను అంతం చేయడానికి జేజేమ్మ అయిన అనుష్క చేసే డ్యాన్స్‌ సీక్వెన్స్‌ ఎవర్‌గ్రీన్‌. 'భు భు భుజంగం ది ది తరంగం' అంటూ సాగే ఆ పాటను తెరపై చూస్తుంటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. అలాంటి పాటకు నృత్యాలు సమకూర్చిన ఘనత శివ శంకర్‌ మాస్టర్‌ది.

దాదాపు 32రోజుల పాటు ఈ పాటను షూట్‌ చేశారట. ఆ పాటను ఎలా తెరకెక్కించాలో దర్శకుడు కోడి రామకృష్ణతో పాటు, నిర్మాత శ్యాంప్రసాద్‌ శివ శంకర్‌ మాస్టర్‌కు ఊహాచిత్రాన్ని ఇచ్చారట. దీంతో అనుష్కకు ప్రాక్టీస్‌ చేయించడం ప్రారంభించారు.

రష్యా నుంచి డూప్‌ను రప్పించి, అనుష్క ఎలా చేయాలో చేసి చూపించారు. ఆ సమయానికి అనుష్కకు పెద్దగా డ్యాన్స్‌ రాకపోయినా శివ శంకర్‌ మాస్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు నృత్య భంగిమలు నేర్పించారు. ఆ తర్వాత ఆమెకు డ్రస్‌ వేసి, చూసుకునే సరికే ఒకవారం రోజులు పట్టిందని శివశంకర్‌ ఓ సందర్భంలో చెప్పారు.

సాధారణంగా శివ శంకర్‌ మాస్టర్‌ ఒక పాటను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేవారట. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ధీర ధీర' పాట పూర్తి చేయడానికి 22 రోజులు పట్టిందట. ఎందుకంటే ఆ పాటను కొంత భాగం రాజస్థాన్‌లో తీశారు.

ఒక ప్రాంతంలో కేవలం ఉప్పు మాత్రమే ఉంటుంది. అక్కడ కొంత భాగాన్ని తెరకెక్కించారు. మళ్లీ ఏడాది తర్వాత రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్‌ వేసి, డ్యాన్సర్లతో సహా 15 రోజులు షూట్‌ చేశారట. అంత శ్రద్ధగా తెరకెక్కించారు కాబట్టే ఆ పాటకు జాతీయ అవార్డు వచ్చింది.

Tags:    

Similar News