Thalapathy Vijay: రాజకీయ సభలో వివాదం.. అభిమానిపై దాడి దళపతి విజయ్ పై కేసు నమోదు
Thalapathy Vijay: తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ అధ్వర్యంలో ఇటీవల తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండో రాష్ట్ర సమ్మేళనం జరిగింది.
Thalapathy Vijay: తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ అధ్వర్యంలో ఇటీవల తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండో రాష్ట్ర సమ్మేళనం జరిగింది. ఆగస్టు 21న జరిగిన ఈ సభలో ఒక అభిమానిపై బౌన్సర్ల దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దళపతి విజయ్ సహా 10 మంది బౌన్సర్లపై కేసు నమోదైంది.
అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న వీడియోలో తలపతి విజయ్ రాంప్‌పై కనిపిస్తున్నారు. రాంప్ కింద భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు విజయ్‌ని కలిసేందుకు రాంప్ ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఒక బౌన్సర్ ఓ వ్యక్తిని రాంప్ మీద నుంచి కిందకు తోసేశాడు. అయితే ఆ వ్యక్తి అదృష్టవశాత్తూ రెయిలింగ్ పట్టుకొని కింద పడకుండా తప్పించుకున్నాడు.
ఈ ఘటనపై బాధితుడు శరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెరంబలూరు జిల్లాకు చెందిన శరత్ కుమార్, అతని తల్లి కున్నం పోలీస్ స్టేషన్‌లో బౌన్సర్లు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు దళపతి విజయ్, 10 మంది బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును మదురైకి బదిలీ చేశారు.
నటుడిగా విజయ్ చివరి సినిమా అదే!
దళపతి విజయ్ గతేడాది రాజకీయాల్లోకి వచ్చారు. ఫిబ్రవరి 2024లో ఆయన తమిళగ వెట్రి కజగం (TVK) పేరుతో తన పార్టీని స్థాపించారు. నటనకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. జన నాయగన్ అనే చిత్రం ఆయనకు నటుడిగా చివరి సినిమా అవుతుందని తెలిపారు. ఈ సినిమా జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల కానుంది.