Boney Kapoor:యూట్యూబర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఆగ్రహం వ్యక్తం చేసిన బోనీ కపూర్
ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. యూట్యూబర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఆగ్రహం వ్యక్తం చేసిన బోనీ కపూర్
Boney Kapoor: ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. యూట్యూబర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన నిర్మాత బోనీ కపూర్ యూట్యూబర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
యూట్యూబర్ చేసిన పనిని తాను అస్సలు సమర్థించనన్నారు బోనీ కపూర్. ప్రతి విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. సినిమాలకు సెన్సార్ ఎలా ఉంటుందో.. ఏదైన విషయం మాట్లాడేటప్పుడు ఆ విషయం మాట్లాడొచ్చా..? లేదా ..? అనే విషయాన్ని మనకు మనమే పరీక్షించుకోవాలి. ఇంట్లో ఎలాగైనా మాట్లాడొచ్చు. కానీ పబ్లిక్‌లోకి వచ్చిన తర్వాత మాట్లాడేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని.. హుందాగా వ్యవహరించాలని బోనీకపూర్ తెలిపారు.
ఇక ఛావా ఈవెంట్‌లో ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ పరోక్షంగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూస్తున్నామన్నారు. నేటి తరం యువత పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఇలాంటి వాళ్లు సొంత కుటుంబసభ్యులను కూడా పట్టించుకోరని అన్నారు రాజ్ పాల్ యాదవ్.
ఓ కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని అతని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కామెడీ షో పై ఇప్పటికే అస్సాంలో కేసు నమోదు కాగా.. తాజాగా మహారాష్ట్రలోనూ పోలీసులు కేసు నమోదు చేశారు. తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రణ్‌వీర్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని.. వాటిలో ఎలాంటి హాస్యం లేదు. కామెడీ చేయడం తనకు చేతకాదన్నారు. ఈ విధంగా తన ఛానెల్‌కు ప్రచారం తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు చాలామంది అనుకుంటున్నారని.. కానీ తన ఉద్దేశం అది కాదని.. తనను క్షమించాలని కోరారు.