బాలీవుడ్ లో విషాదం.. నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంగళవారం అయన ముంబాయిలోని కోకిలాబెన్ ఆసుపత్రి లో చేరారు. వైద్యులు ICU లో ఉంచి చికిత్స అందించారు. చికిత్సకు ఆయన ఆరోగ్యం ఎంత మాత్రం సహకరించకపోవడంతో.. ఆస్పత్రిలోనే ఈరోజు (ఏప్రిల్ 29) ఇర్ఫాన్ ఖాన్ తుది శ్వాస విడిచారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2018 మేలో ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. లండన్‌లో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల భారత్ చేరుకున్నారు.
ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'అంగ్రేజి మీడియం' మార్చి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోనూ మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ నటించారు. 1967 జనవరి 7న జైపూర్ లో జన్మించారు. 2011లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
వారం తిరగకుండానే తల్లి చెంతకు..
గత శనివారం ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం(95) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇర్ఫాన్ ఖాన్ ముంబయిలో చిక్కుకుపోయారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ ఖాన్ తన తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.