అడాలసెన్స్ సిరీస్ లాంటివి తీయలేరా? నెట్‌ఫ్లిక్స్ ఇండియాను ఏకిపారేసిన అనురాగ్ కశ్యప్
Anurag Kashyap reviews Adolesence: అడాలసెన్స్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఒక హిట్ అండ్ హాట్ కేక్
అడాలసెన్స్ సిరీస్ లాంటివి తీయలేరా? నెట్‌ఫ్లిక్స్ ఇండియాను ఏకిపారేసిన అనురాగ్ కశ్యప్
Adolesence review by Anurag Kashyap: ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ అనురాగ్ కశ్యప్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బ్రిటన్‌లో నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు అడాలసెన్స్ అనే మినీ సిరీస్ నిర్మించారు. ఈ సిరీస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అందులో ప్రస్తావించిన కథనం వీక్షకులను కట్టిపడేస్తోంది.
ఇదే విషయమై అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఇండియాలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు ఎందుకు అలాంటి కథలు తెరకెక్కించే ప్రయత్నం చేయరు అని ఘాటుగానే ప్రశ్నించారు. "అలాంటి షోస్ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ధైర్యం, నిజాయితీ, నైతికత మీకు లేవు" అని అన్నారు. అందుకే అడాలసెన్స్ లాంటి షోను మీరు ప్రొడ్యూస్ చేయలేరని అనురాగ్ అభిప్రాయపడ్డారు. మీకు ( నెట్‌ఫ్లిక్స్ ఇండియా మేనేజ్మెంట్ ) నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ పెంచుకోవడంపై ఉన్న ఆసక్తి కంటెంట్‌పై లేదని మండిపడ్డారు.
అడాలసెన్స్ మేకర్స్‌పై అనురాగ్ ప్రశంసలు
అడాలసెస్ మినీ సిరీస్ మేకర్స్‌పై ప్రశంసలు గుప్పిస్తూ అనురాగ్ కశ్యప్ తన సోషల్ మీడియా పోస్ట్‌ను మొదలుపెట్టారు. అడాలసెన్స్ తనను కట్టిపడేసిందన్న అనురాగ్... ఏ ఒక్క అంశాన్ని మిస్ అవకుండా తెరకెక్కించిన వారి ధైర్యాన్ని అభినందింకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. తాను చూసిన ఎన్నో సినిమాలు, సిరీస్‌ల కంటే ఇది ఎంతో బాగుందన్నారు.
ఇంతకీ అడాలసెన్స్ సిరీస్‌లో అంతగా ఏముంది?
నెట్‌ఫ్లిక్స్ బ్రిటన్ నిర్వాహకులు గతేడాది తీసుకొచ్చిన 'వన్ డే', 'ది జెంటిల్‌మేన్' షోలు రెండూ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది కూడా నెట్‌ఫ్లిక్స్ బ్రిటన్‌కు మరో రెండు షోలు అదే రేంజులో సక్సెస్‌ను అందించాయి. విచిత్రం ఏంటంటే... ఆ రెండింటికి కథను అందించిన రచయిత ఒక్కరే. 2025 మొదట్లోనే 'టాక్సిక్ టౌన్' అనే షోతో రచయిత జాక్ థోన్ సూపర్ హిట్ అందుకున్నారు. సమాజంలో ఎక్కువగా అన్యాయానికి గురయ్యే మహిళల కోణంలో సామాజిక న్యాయంపై తెరకెక్కించిన టాక్సిక్ టౌన్ సిరీస్ రచయితగా జాక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
ఇప్పుడు అదే రచయిత రాసిన అడాలసెన్స్ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ యూకేకు వారాల తేడాలోనే మరో హిట్ అందించింది. ఇప్పటికి ఇంకా మనం మార్చి నెలలోనే ఉన్నాం... కానీ ఈ ఏడాది మొత్తంలోనే ఇదే హిట్ అనేలా నెట్‌ఫ్లిక్స్ బ్రిటన్‌కు సక్సెస్ అందించింది. ఇది ఒక సైకాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన బ్రిటీష్ క్రైమ్ డ్రామా సిరీస్. స్టీఫెన్ గ్రాహం కీలక పాత్ర పోషించారు.
అడాలసెన్స్ సిరీస్ కథ ఏంటి?
13 ఏళ్ల జేమీ మిల్లర్ తన క్లాస్‌మేట్ మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. ఆ హత్య చేసింది ఆ కుర్రాడే అనేందుకు ప్రాసిక్యూషన్ వారు అన్ని ఆధారాలు చూపించినప్పటికీ... జేమీ కుటుంబం మాత్రం వారి ఆరోపణలను ఏ మాత్రం నమ్మదు. తండ్రి ఎడ్డీ, తల్లి మండా, సోదరి లీసా... వీళ్లలో ఏ ఒక్కరు కూడా జేమీ ఆ హత్య చేశాడంటే నమ్మరు. జేమీని ఆ మర్డర్ కేసులోంచి బయటపడేసేందుకు ఆ కుటుంబం ఎలా పోరాడింది? అసలు జేమీ ఆ హత్య చేశారా లేదా అనేదే అడాలసెన్స్ స్టోరీ.
ఓపెనింగ్ సీన్‌తోనే ఆసక్తిని పెంచిన అడాలసెన్స్
అడాలసెన్స్ ఓపెనింగ్ షాట్‌లోనే పోలీసులు వచ్చి జేమీని అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది. ఇంట్లోంచి జేమీని లాక్కుని వెళ్లి పోలీసు వ్యాన్‌లోకి తోసేస్తారు. ఆ తరువాత రిమాండ్‌కు తరలిస్తారు. అక్కడి నుండి మొదలయ్యే అడాలసెన్స్ కథ చివరి వరకు ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది. పట్టణ వాతావరణంలో ఒంటరితనం అనుభవించే ఒక పిల్లాడి జీవితంలో ఏం జరిగిందనే కథను ముడిసరుకుగా తీసుకుని 'అడాలసెన్స్'ను సెన్సిటివ్‌గా తెరకెక్కించారు.
ట్రెండ్ అవుతున్న అడాలసెన్స్
ఫిలిప్ బరంటిని డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ మార్చి 13 రిలీజ్ అయింది. రిలీజైన మొదటి మూన్నాలుగు రోజుల నుండే వరల్డ్ వైడ్‌గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న అడాలసెన్స్ షో ఆద్యంతం ఆడియెన్స్‌ను సీట్లకు కట్టిపడేస్తోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇదొక హిట్ అండ్ హాట్ కేక్... ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్.
Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?