Akshay Kumar: స్టంట్‌మ్యాన్ మృతితో చలించిన అక్షయ్‌కుమార్.. ఇండస్ట్రీలో 650 మందికి ఇన్సూరెన్స్

Akshay Kumar: పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేట్టువం’ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-07-18 04:47 GMT

Akshay Kumar: పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వేట్టువం’ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్టంట్స్‌ చేస్తుండగా అనుకోకుండా స్టంట్‌మ్యాన్‌ రాజు మృతి చెందారు. ఈ ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజు మరణవార్త బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌ కుమార్‌ను కలచివేసింది. ఈ విషాద ఘటనపై స్పందించిన అక్షయ్‌ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

ఇండస్ట్రీలో పనిచేస్తున్న సుమారు 650 మంది స్టంట్‌ మ్యాన్‌లు మరియు యాక్షన్‌ సిబ్బందికి ఆరోగ్య, ప్రమాద బీమా కలిగిన ఇన్సూరెన్స్‌ పాలసీని అందించారు. ఇందులో భాగంగా, పనిలో గాయపడినా లేదా ప్రమాదానికి గురైనా వారికి రూ.5 లక్షల వరకు బీమా లాభాలు అందుబాటులో ఉంటాయి. అక్షయ్‌ చేసిన ఈ పనిపై పరిశ్రమవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖ స్టంట్ మాస్టర్ విక్రమ్‌ సింగ్‌ స్పందిస్తూ, “మీరు చేసిన ఈ ఉపకారం మాటల్లో చెప్పలేనిది. ఇండస్ట్రీలో 650–700 మంది స్టంట్‌ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు భద్రతలో ఉన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేయడమే చాలా చిన్న విషయం” అని తెలిపారు.

ఇక ‘వేట్టువం’ సినిమా విషయంలో, నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ నాగపట్నం సమీపంలో జరుగుతోంది. స్టంట్ సీన్ చిత్రీకరణ సందర్భంగా కారుతో స్టంట్స్‌ చేస్తున్న రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. ఇది మరొకసారి సెట్లపై జాగ్రత్తల అవసరాన్ని గుర్తుచేస్తోంది.

Tags:    

Similar News