Actress Prathyusha Death Case: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని ఆదేశం!
Prathyusha Death Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.
Prathyusha Death Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, ఆయనను వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
గతంలో ఈ కేసును విచారించిన హైకోర్టు, సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ, నిందితుడు శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో ఒక కీలక ఘట్టం ముగిసినట్లయింది.
అసలేం జరిగింది? (కేసు నేపథ్యం):
ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ప్రేమలో పడ్డారు. ప్రత్యూష హీరోయిన్‌గా ఎదుగుతున్న క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం వేళ వీరిద్దరూ విషం తీసుకున్నారు. వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటి రోజే ప్రత్యూష ప్రాణాలు విడిచింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం మార్చి 9న కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగడం వల్లే ఈ మరణం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. అయితే, దీని వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పింది సిద్ధార్థ రెడ్డియేనని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. అయితే, వైద్యుల నివేదిక ప్రకారం ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని స్పష్టమైంది.