Trisha Krishnan: బీజేపీ నేత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన త్రిష. పాలిటిక్స్‌పై కీలక ప్రకటన.. ఆ రిలేషన్‌పై ఏమన్నారంటే?
Trisha: తన వ్యక్తిగత జీవితంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై దక్షిణాది అగ్రనటి త్రిష తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Trisha: తన వ్యక్తిగత జీవితంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై దక్షిణాది అగ్రనటి త్రిష తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "అగౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే" అంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేసిన ఆమె, సోమవారం తన న్యాయవాది ద్వారా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
న్యాయవాది నిత్యేశ్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ఈ ప్రకటనలో త్రిష తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. "నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేదు. నన్ను కేవలం నా నటన, వృత్తిపరమైన విజయాలతోనే గుర్తించాలి తప్ప, అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దు" అని ఆమె స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
ఇటీవల నటుడు విజయ్ సేలంలో నిర్వహించిన భారీ రాజకీయ ర్యాలీపై నైనార్ నాగేంద్రన్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో విజయ్‌కు రాజకీయ అనుభవం లేదని చెబుతూ.. "విజయ్ ముందు నటి త్రిషతో రిలేషన్ నుంచి బయటకు రావాలి... అప్పుడే రాజకీయ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమవుతుంది" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
"రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదు. వ్యక్తిగత జీవితాలను బహిరంగ చర్చకు పెట్టడం సరికాదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత సంయమనంతో మాట్లాడాలి" అని త్రిష హితవు పలికారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై డీఎంకే సహా పలు పార్టీలు నైనార్ నాగేంద్రన్‌ను తప్పుబట్టాయి. త్రిష ఇచ్చిన ఈ క్లారిటీతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.