Nikhil: స్టార్ హీరో సినిమాపై కౌంటర్.. వాళ్లలాగా మేం ఏఐ వాడలేదు

Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Update: 2026-02-16 06:08 GMT

Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేవలం టీజర్ విడుదల విషయంలోనే కాకుండా, నిఖిల్ చేసిన ఒక సెన్సేషనల్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అయితే, యూట్యూబ్ సాంకేతిక లోపాల కారణంగా విజువల్స్ ఆశించిన స్థాయిలో క్వాలిటీగా కనిపించలేదు. తన సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడని నిఖిల్, వెంటనే ఆ టీజర్‌ను యూట్యూబ్ నుండి తొలగించి, హై-క్వాలిటీ HDR వెర్షన్, సినిమాస్కోప్ వ్యూలో మళ్ళీ అప్‌లోడ్ చేయించారు. ఈ కొత్త వెర్షన్ చూసిన ప్రేక్షకులు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.

టీజర్‌ను రీ-అప్‌లోడ్ చేసే క్రమంలో నిఖిల్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల టీజర్‌ను మళ్లీ అప్‌లోడ్ చేశాం. అయితే ఒకటి మాత్రం స్పష్టం.. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాల్లో లాగా మా ‘స్వయంభు’లో మేము ఎక్కడా AI ని ఉపయోగించలేదు. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో కష్టపడి నేచురల్‌గా చిత్రీకరించాం అని నిఖిల్ పేర్కొన్నారు. ఇటీవల ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో విజువల్స్ మరియు క్యారెక్టర్స్ కోసం ఏఐ వాడారనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు నిఖిల్ నేరుగా 'ఏఐ వాడలేదు' అని చెప్పడం, ఆ పెద్ద సినిమాను ఉద్దేశించి చేసిన కౌంటర్ అనే సందేహాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నిఖిల్ వర్సెస్ సదరు సినిమా అభిమానుల మధ్య చర్చ మొదలైంది.

వివాదాలు పక్కన పెడితే, ‘స్వయంభు’ సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. బాహుబలి ఫేమ్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. సినిమా అంటే కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కష్టం కూడా ఉండాలని నిఖిల్ చెప్పకనే చెప్పిన ఈ పోస్ట్, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Tags:    

Similar News