Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు.. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూత
మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు.. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూత
Plane Crash : మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషాద వార్తతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రాజకీయ ప్రస్థానానికి పురిటిగడ్డ అయిన బారామతిలోనే ఆయన తుదిశ్వాస విడవడం అభిమానులను కలిచివేస్తోంది. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరుగాంచిన అజిత్ పవార్ మరణవార్త మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరిన ఆయన విమానం, ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. అజిత్ పవార్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
ఆఖరి ప్రయాణం ఇలా..
బారామతిలో జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించాల్సి ఉంది. తన సొంత గడ్డపై పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వేను తప్పి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కూలిపోయిందని, వెంటనే ఇంధన ట్యాంక్ పేలడంతో విమానం క్షణాల్లో అగ్నిగోళంగా మారిందని సమాచారం.
రికార్డుల వీరుడు అజిత్ పవార్
అజిత్ పవార్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన కింగ్ మేకర్. రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన పేరిట ఉంది. వేర్వేరు సమయాల్లో ఏకంగా ఆరుసార్లు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. పరిపాలనపై గట్టి పట్టున్న నేతగా, కార్యకర్తల మనిషిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్సీపీలో చీలిక తర్వాత మహాయుతి ప్రభుత్వంలో చేరి 8వ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలో విషాదం
బారామతి అంటే అజిత్ పవార్‌కు ప్రాణం. తన రాజకీయ ఎదుగుదల మొత్తం అక్కడి నుంచే మొదలైంది. అలాంటి గడ్డపైనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అక్కడి ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్లు, ఇతర సిబ్బంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. అజిత్ పవార్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించే అవకాశం ఉంది.