Reused Cooking Oil : రోడ్డు పక్కన ఫుడ్ తినేవారికి అలర్ట్.. వంట నూనె మళ్లీ, మళ్లీ వాడడంపై మానవ హక్కుల సంఘం సీరియస్
ఈ మధ్య కాలంలో భారత యువతలో ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు, ఇంకా అనేక అనారోగ్యాలు రావడానికి వంట నూనెలను మళ్ళీ మళ్ళీ వాడటమే కారణమని చెబుతున్నారు.
Reused Cooking Oil : రోడ్డు పక్కన ఫుడ్ తినేవారికి అలర్ట్.. వంట నూనె మళ్లీ, మళ్లీ వాడడంపై మానవ హక్కుల సంఘం సీరియస్
Reused Cooking Oil : ఈ మధ్య కాలంలో భారత యువతలో ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు, ఇంకా అనేక అనారోగ్యాలు రావడానికి వంట నూనెలను మళ్ళీ మళ్ళీ వాడటమే కారణమని చెబుతున్నారు. దేశంలో వంట నూనెను విపరీతంగా మళ్ళీ వాడతున్నారని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. ఇప్పుడు ఈ విషయంపై మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత ఆహార భద్రత నాణ్యత ప్రాధికార సంస్థ (FSSAI)లకు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలను విచారించి, ఈ కేసు సంబంధిత నివేదికను, రెండు వారాల్లో తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
అక్టోబర్ 22న వచ్చిన ఫిర్యాదు ప్రకారం..ఇది ప్రాథమికంగా మానవ హక్కుల ఉల్లంఘనగా కనిపిస్తుందని NHRC పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన సార్థక్ సముదాయక్ వికాస్ ఏవం జన్ కళ్యాణ్ సంస్థ వ్యవస్థాపకుడు ఇచ్చిన ఫిర్యాదులో, భారతదేశంలో వంట నూనెను విస్తృతంగా మళ్ళీ వాడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారని, చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, ఆహార విక్రేతలు ఉపయోగించిన వంట నూనెను పదే పదే మళ్లీ వాడుతున్నారని లేదా మళ్ళీ అమ్ముతున్నారని తెలిపారు. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత సమస్యలతో సహా తీవ్రమైన ప్రజారోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిని ప్రజారోగ్యంపై ప్రభావం చూపే మానవ హక్కుల సమస్యగా పరిగణించి, అమలు చేసే సంస్థలు ఈ నియమాలను కఠినంగా అమలు చేయడానికి, అధీకృత నూనె శుద్ధి, రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, అలాగే మళ్ళీ వాడిన వంట నూనె వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని ఆదేశించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై విచారణ జరిపి, ఈ విషయంలో రాష్ట్రాల వారీగా నివేదికను అందించాలని భారత ఆహార భద్రత, నాణ్యత ప్రాధికార సంస్థ (FSSAI), ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశించినట్లు కమిషన్ పేర్కొంది.