World Rose Day 2025: వరల్డ్ రోజ్ డే అంటే లవర్స్ డే కాదు.. మరి ఎవరి కోసమో తెలుసా ?

మానవుడికి వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఒక అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం ఒక కోటి మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు.

Update: 2025-09-23 06:10 GMT

World Rose Day 2025: వరల్డ్ రోజ్ డే అంటే లవర్స్ డే కాదు.. మరి ఎవరి కోసమో తెలుసా ?

World Rose Day 2025: మానవుడికి వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఒక అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం ఒక కోటి మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన వ్యాధి కావడంతో క్యాన్సర్ అంటే జీవితానికి ముగింపు అని భావిస్తారు. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కృంగదీస్తుంది. అందుకే, ఈ వ్యాధిపై ధైర్యంగా పోరాడి విజయం సాధించవచ్చని నమ్మకాన్ని కల్పించడానికి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ గులాబీ దినోత్సవం చరిత్ర

క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి సపోర్టు, బతకాలన్న ఆశ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 1994లో ప్రారంభమైన ఒక ప్రపంచవ్యాప్త ప్రచారం. ఈ రోజును కెనడాకు చెందిన 12 ఏళ్ల బాలిక మెలిండా రోజ్ జ్ఞాపకార్థం ప్రారంభించారు.

1994లో మెలిండా రోజ్ ఆస్కిన్ ట్యూమర్ అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్‌తో బాధపడింది. వైద్యులు ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే జీవించగలదని చెప్పారు. కానీ, రోజ్ మాత్రం ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసింది. ఈ ఆరు నెలల కాలంలో, ఆమె క్యాన్సర్ ఉందని మానసికంగా కుంగిపోకుండా, సానుకూల ఆలోచనలతో కథలు, కవితలు రాసింది. ఇతర క్యాన్సర్ రోగులతో సమయం గడుపుతూ, వారి బాధను మర్చిపోయేలా చేయడానికి ప్రయత్నించింది. ఈ విధంగా ఆరు నెలల పాటు రోజ్ క్యాన్సర్‌తో పోరాడిన ధైర్యం, ఆమె జీవించాలనే తపన ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. అందుకే ఈ ధైర్యవంతురాలైన బాలిక జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ గులాబీ దినోత్సవం ప్రాముఖ్యత

ఈ రోజు క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో ఆశ, ఉత్సాహాన్ని నింపడానికి అంకితమైన రోజు.

గులాబీలు ఇవ్వడం: ఈ రోజు క్యాన్సర్ రోగులకు గులాబీలు ఇవ్వడం ద్వారా, క్యాన్సర్ అనేది జీవితానికి ముగింపు కాదని, ఈ ప్రాణాంతక వ్యాధిపై పోరాడి విజయం సాధించవచ్చనే సందేశం ఇస్తారు.

అవగాహన కల్పించడం: ఈ రోజున ప్రజలకు క్యాన్సర్ వ్యాధి గురించి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించమని ప్రోత్సహిస్తారు.

మద్దతు ఇవ్వడం: క్యాన్సర్ రోగులకు మద్దతు ఇవ్వడానికి ఈ రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఐక్యతతో మనం కష్టాలను ఎదుర్కోవచ్చని ఈ రోజు చూపిస్తుంది.

ఈ రోజును ఎలా జరుపుకుంటారు?

గులాబీ ప్రేమ, ఆనందానికి చిహ్నం. అందుకే ప్రపంచ గులాబీ దినోత్సవం రోజున క్యాన్సర్ రోగులకు గులాబీలు ఇస్తారు. వారు ఒంటరిగా పోరాటం చేయనవసరం లేదని, మనం అందరం మానసికంగా వారికి అండగా ఉంటామని ఈరోజు సందేశం ఇస్తుంది. వారిలో జీవితంపై ఆశను నింపుతుంది.

Tags:    

Similar News