Kidney Infection : కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి?
కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అవి రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు, టాక్సిక్ పదార్థాలను బయటకు పంపుతాయి. అంతేకాకుండా, శరీరంలోని నీరు, మినరల్స్ సమతుల్యతను కూడా కాపాడతాయి.
Kidney Infection : కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి?
Kidney Infection : కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అవి రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు, టాక్సిక్ పదార్థాలను బయటకు పంపుతాయి. అంతేకాకుండా, శరీరంలోని నీరు, మినరల్స్ సమతుల్యతను కూడా కాపాడతాయి. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వస్తే, ఈ పనులన్నీ ఆగిపోతాయి. ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను వైద్య పరిభాషలో పైలోనెఫ్రైటిస్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుండి మొదలై, నెమ్మదిగా కిడ్నీల వరకు పాకుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ను సకాలంలో ఆపకపోతే, కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతింటాయి. రక్తంలో ఇన్ఫెక్షన్ పెరిగి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది.
కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్య కారణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ట్ ద్వారా బ్యాక్టీరియా కిడ్నీల వరకు చేరి, ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. మహిళల్లో పురుషుల కంటే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మహిళల మూత్రనాళం చిన్నదిగా ఉంటుంది, దీంతో బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, కిడ్నీలో రాళ్లు, మధుమేహం, గర్భిణీలు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. క్యాథెటర్ ద్వారా మూత్రం పోసేవారికి లేదా పదే పదే యూటీఐతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఉంటుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు నెమ్మదిగా లేదా ఒక్కసారిగా కనిపించవచ్చు. తీవ్రమైన జ్వరం, చలి, నడుము కింది భాగంలో లేదా వెన్ను భాగంలో నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, పదే పదే మూత్రం రావడం లేదా చాలా తక్కువ మూత్రం రావడం వంటివి కనిపిస్తాయి. కొంతమందికి మూత్రం దుర్వాసన రావడం, నురుగు లేదా రక్తం కనిపించడం జరుగుతుంది. శరీరంలో అలసట, వికారం లేదా వాంతులు కూడా రావచ్చు.
ఇన్ఫెక్షన్ పెరిగితే, గందరగోళం, తల తిరగడం, రక్తపోటు తగ్గడం వంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు, మూడు రోజులకు మించి ఉంటే లేదా వేగంగా పెరుగుతుంటే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించాలి. రోజుకు తగినంత నీరు తాగడం వల్ల మూత్రవ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. మూత్రం వచ్చినప్పుడు వెంటనే వెళ్లడం మంచిది. టాయిలెట్ వాడిన తర్వాత ప్రైవేట్ భాగాలను సరైన విధంగా శుభ్రం చేసుకోవాలి. మంచి, పోషకాహారం తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యూటీఐ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయించుకోవాలి. మధుమేహం లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఉంటే, తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ యాంటీబయాటిక్స్ వాడవద్దు.