Ugadi Pachadi 2023: ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి.. ఎందుకు తీసుకోవాలంటే..?

Ugadi Pachadi 2023: ఉగాది అంటే అందరికి గుర్తుకొచ్చేది షడ్రుచులతో కూడిన పచ్చడి.

Update: 2023-03-22 03:30 GMT

Ugadi Pachadi 2023: ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి.. ఎందుకు తీసుకోవాలంటే..?

Ugadi Pachadi 2023: ఉగాది అంటే అందరికి గుర్తుకొచ్చేది షడ్రుచులతో కూడిన పచ్చడి. ఉగాది రోజు ప్రతిఇంట్లో పచ్చడి తయారుచేసి ఆరగిస్తారు. ఈ పచ్చడిని వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తారు. తీపి,పులపు, కారం, ఉప్పు, చేదు, వగరు వంటి ఆరు రుచుల పచ్చడి మాటల్లో వివరించలేనిదిగా ఉంటుంది. ఈ పచ్చడి సంప్రదాయంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలని కూడా కలిగి ఉంటుంంది. దాని గురించి తెలుసుకుందాం.

ఉగాది సందర్భంగా వసంత రుతువులోకి ప్రవేశిస్తున్న కారణంగా శారీరకంగా, మానసికంగా తలెత్తే మార్పుల్ని కట్టడి చేసి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఉగాది పచ్చడి దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పచ్చడి మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలను సూచిస్తుంది. ఇందులోని రుచులలో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది.

ఉప్పు - దీనిని జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. ఇది రుచిని, భయాన్ని సూచిస్తుంది. ఉప్పు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలిని కలిగిస్తుంది. కానీ ఉప్పును అధికంగా వాడకూడదు.

పులుపు - పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. ఎలాంటి పరిస్థితులకైనా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది. జీర్ణ శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

వేప పువ్వు - బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. వేపపూత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది. బ్లడ్ ను శుద్ధి చేస్తుంది. మామిడి, చింతపండుతో పాటు వేపను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి బాడీలోని విషపదార్థాలు బయటకి వస్తాయి.

బెల్లం - ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కొత్తబెల్లాన్ని తింటే మనకు ఆకలి కలగడమే కాక మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. ఇందులో ఉండే గుణాలు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఇది పిత్తం, వాతం సమస్యలను తగ్గిస్తుంది. కొత్త కణాలను ఏర్పరిచేందుకు సహాయపడుతుంది.

కారం - సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.

వగరు - పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. ఇవి శరీరాన్ని బలంగా చేస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి రోజూ తినడం వల్ల గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ సమస్యల నుంచి దూరం చేస్తుంది.

Tags:    

Similar News