Weekend Tips: స్ట్రెస్‌ను దూరం పెట్టండి.. వారాంతాన్ని ఇలా ఆస్వాదించండి!
వీకెండ్‌ను సరైన విధంగా ప్లాన్ చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. నిపుణులు సూచించిన సులభమైన వీకెండ్ టిప్స్ ఇవే.
Weekend Stress Relief Tips: How to Plan a Happy & Refreshing Weekend
వారమంతా చదువులు, ఉద్యోగ బాధ్యతలతో గడిపిన తర్వాత వచ్చే వీకెండ్‌ను చాలామంది సరైన విధంగా వినియోగించుకోలేకపోతున్నారు. విశ్రాంతి పేరుతో ఎక్కువసేపు నిద్రపోవడం, రొటీన్ పనులతోనే రోజును ముగించేయడం వల్ల వారాంతం క్షణాల్లో ముగిసిపోతోంది. అయితే నిపుణులు సూచిస్తున్నదేమిటంటే… వీకెండ్‌ను సరైన ప్లానింగ్‌తో గడిపితే మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా వ్యక్తిగత జీవితానికి కొత్త ఉత్సాహం లభిస్తుందని చెబుతున్నారు.
వీకెండ్ రోజున ఆలస్యంగా నిద్రలేవకుండా ఉదయాన్నే లేచి కిటికీలు, తలుపులు తెరిచి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయపు వేళ వేడివేడి కాఫీ లేదా టీతో రోజును ప్రారంభించడం శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుందని అంటున్నారు. ఫోన్‌కు దూరంగా ఉండి కొంత సమయం స్వయంకోసం కేటాయించుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
అలాగే స్థానిక పార్క్‌లో నడక లేదా సైక్లింగ్ చేయడం ద్వారా శారీరక వ్యాయామంతో పాటు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం సిద్ధం చేయడం, వారితో ముచ్చటించడం కుటుంబ అనుబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొంటున్నారు.
మధ్యాహ్నం వేళ కుటుంబంతో కలిసి భోజనం చేయడం, మంచి సినిమా లేదా వెబ్‌సిరీస్ చూడడం లేదా పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి హాబీలకు సమయం కేటాయించడం మానసిక సంతృప్తిని ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. సాయంత్రం వేళ వాకింగ్, మార్కెట్‌కు వెళ్లడం లేదా స్నేహితులతో గడపడం ద్వారా వీకెండ్ మరింత ఆనందంగా మారుతుందని చెబుతున్నారు.
ప్రతి వారం కాకపోయినా అప్పుడప్పుడైనా వీకెండ్‌ను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడి తగ్గి, కొత్త వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.