Induction Buying Guide: మీ ఇండక్షన్ స్టవ్‌పై ఈ మార్క్ ఉందా? కొనేముందు ఇది చూడకపోతే ప్రమాదంలో పడ్డట్లే.?

Induction Buying Guide: గ్యాస్ కొరతతో అంతా ఇండక్షన్ వైపు చూస్తున్నారు. అయితే, వీటిని కొనేముందు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోవాలి.

Update: 2026-04-10 05:41 GMT

Induction Buying Guide

Induction Stove Safety: ప్రస్తుతం వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మార్కెట్లో లభించే ఏ ఇండక్షన్ పడితే అది కొనడం మీ ప్రాణాలకే ముప్పు కావొచ్చు. అందుకే, వినియోగదారులు ఇండక్షన్ కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా 'CRS' గుర్తును పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

భద్రతకు భరోసా: ప్రభుత్వం కీలక సూచన..

దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు నాణ్యత లేని పరికరాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది. ఇండక్షన్ స్టవ్ కొనేముందు దానిపై 'CRS' (కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్) మార్క్ ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. ఈ గుర్తు ఉంటేనే అది ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారైందని అర్థం.

CRS మార్క్ అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యం?

CRS అనేది విద్యుత్ పరికరాల నాణ్యతను ధృవీకరించే ఒక ప్రామాణిక గుర్తు. ఇండక్షన్ స్టవ్ పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది కాబట్టి, నాణ్యత లోపిస్తే పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఈ గుర్తు ఉన్న స్టవ్‌లు విద్యుత్ షాక్‌లు, అతిగా వేడెక్కడం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

విద్యుత్ షాక్ నుంచి రక్షణ..

నాణ్యత లేని ఇండక్షన్ స్టవ్‌లను వాడినప్పుడు, పొరపాటున తడి చేతులతో తాకినా లేదా పరికరంలో లోపాలున్నా విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. కానీ CRS మార్క్ ఉన్న పరికరాల్లో విద్యుత్ బంధక వ్యవస్థ (ఇన్సులేషన్) అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇది వినియోగదారులకు పూర్తి రక్షణను అందిస్తుంది.

అతిగా వేడెక్కడం (ఓవర్ హీటింగ్) నివారణ..

తక్కువ ధరలో లభించే సాధారణ ఇండక్షన్ స్టవ్‌లు ఎక్కువ సేపు వాడితే కరిగిపోవడం లేదా పేలిపోయే అవకాశం ఉంటుంది. ధృవీకరించిన స్టవ్‌లలో 'ఆటో కట్-ఆఫ్' అనే ప్రత్యేక సౌకర్యం ఉంటుంది. దీనివల్ల ఉష్ణోగ్రత పరిమితికి మించి పెరిగినప్పుడు పరికరం దానంతట అదే ఆగిపోతుంది. తద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు.

విద్యుత్ ఆదా..

CRS మార్క్ ఉన్న స్టవ్‌ల పైభాగం అంత త్వరగా వేడెక్కదు. దీనివల్ల వంట చేసేటప్పుడు చేయి తగిలినా కాలే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఇవి తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటూ ఉష్ణాన్ని నేరుగా పాత్రకు చేరవేస్తాయి. ఫలితంగా వంట త్వరగా పూర్తవడమే కాకుండా విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది.

చివరగా, మీ కుటుంబ భద్రత దృష్ట్యా, ఇండక్షన్ స్టవ్ కొనేటప్పుడు కేవలం ధరనే కాకుండా, దానిపై ఉన్న ప్రభుత్వ గుర్తింపు చిహ్నాలను ఖచ్చితంగా గమనించండి.

Tags:    

Similar News