Healthy Breakfast : ఉదయం టిఫిన్ ఏం చేయాలి? పూరీ, వడ, దోస అంటారా? ఓసారి ఆగండి
ఉదయం టిఫిన్ ఏం చేయాలి? పూరీ, వడ, దోష అంటారా? ఓసారి ఆగండి
Healthy Breakfast foods : బ్రేక్‌ఫాస్ట్.. ఆరోగ్యానికి ఎంతో అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాత్రంతా ఏం తినకుండా ఉంటాం కాబట్టే ఫాస్టింగ్‌ను బ్రేక్ చేస్తుందన్న అర్థం టిఫిన్‌కు ఉంది. అయితే చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ అనగానే పూరి, దోష, వడ వంటివే గుర్తొస్తాయి. రుచిలో అమోఘంగా ఉన్నప్పటికీ ఇలాంటి టిఫిన్స్‌తో ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. నూనె శాతం ఎక్కువగా ఉండే వాటిని అస్సలు టిఫిన్‌గా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ టిఫిన్‌లో ఎలాంటివి భాగం చేసుకుంటే మంచిది, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం తీసుకునే ఆహారం రోజంతటికీ కావాల్సిన ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే కచ్చితంగా ఉదయం ఏదో ఒక ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఉదయం టిఫిన్‌లో కొన్ని రకాల ఆహారాలను భాగం చేసుకోవాలని హార్వర్డ్‌కు చెందిన పోషకాహార నిపుణుడు డేవిడ్ లుడ్విగ్ తెలిపారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్‌లో ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లను తీసుకుంటే మంచిది. అలాగే అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకున్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఫైబర్ తర్వాత ఉదయం తీసుకునే టిఫిన్‌లో తప్పనిసరిగా మాంసకృత్తులు ఉండేలా చూసుకుంటే మంచిది. పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు వంటి వాటిని ఉదయం తీసుకోవాలి. వీటిలో మాంసకృత్తులతో పాటు విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.
ఉప్పు, నూనె తక్కువగా ఉండే ఫుడ్‌నే ఉదయం అల్పహారంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే ఇలాంటి హెల్త్ టిప్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా ఇంట్లో చేసుకున్న ఆహారం తినడమే మంచిది. ఇక టిఫిన్‌లో భాగంగా పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, క్యారెట్ వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మేలు జరుగుతుందని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.