Heart Disease: గంటల తరబడి కూర్చుకుంటున్నారా? వారికి మరణం పొంచి ఉన్నట్లే?
Heart Disease: గంటల తరబడి కూర్చుకుంటున్నారా? వారికి మరణం పొంచి ఉన్నట్లే?
Heart Disease: ఛాతీ నొప్పితో ఆసుపత్రిపాలైన రోగులు...ఇంటికి వచ్చిన తర్వాత గంటల తరబడి కూర్చోవడం వల్ల వారికి ఏడాది లోపు గుండె సమస్యలు, మరణం ముప్పు పొంచి ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. దీనిలో భాగంగా ఛాతీ నొప్పి ఉన్న 609 మంది రోగులను పర్యవేక్షించారు.
వీరి సరాసరి వయసు 62ఏళ్లు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాక వీరి శారీరక శ్రమను 30రోజుల పాటు పరిశోధకులు పర్యవేక్షించారు. దీనికోసం వారికి ప్రత్యేక మానిటర్లను అమర్చారు. ఈ సాధనం నిత్యం, రోగుల కదలికలు, కూర్చొన్న సమయం, నిద్ర వంటి అంశాలను నమోదు చేసింది. తర్వాత ఏడాదిపాటు వీరికి కొత్తగా ఏమైనా గుండె సమస్యలు వంటివి వచ్చాయా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు.
నిద్ర సమయాన్ని మినహాయించి రోజుకు 12 గంటలపాటు కదలికలు లేని జీవితాన్ని గడిపిన వారితో పోల్చితే 15గంటల పాటు ఈ తరహా జీవితాన్ని గడిపినవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సంవత్సరంలోపే మరిన్ని గుండె సమస్యల బారినపడటానికి లేదా మరణించడానికి అవకాశం రెట్టింపు స్థాయిలో ఉందని తేలింది.
ఇలా నిస్తేజంగా గడిపే సమయంలో నుంచి కనీసం ఒక అరగంటను వేగంగా నడవడం లేదా పరుగు తీయడం వంటి చురుకైన చర్యలకు మళ్లిస్తే రోగులకు ప్రయోజనం ఉంటుందని తేలింది. ఇలాంటివారికి తదుపరి సంవత్సరంలో మరిన్ని గుండె జబ్బులు, లేదా మరణం ముప్పును ఎదుర్కునే అవకాశం 62శాతం వరకు తగ్గుతుందని తెలిపింది.
ఆ అరగంట సమయాన్ని తేలికపాటి కదలికలకు వెచ్చిస్తే గుండె సమస్యలు, మరణం ముప్పును 50శాతం తగ్గించుకోవచ్చని వెల్లడయ్యింది. ఒకవేళ ఆ అర గంట నిద్రకు వినియోగించినా గుండె జబ్బులు, మరణం ముప్పు 14శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.