Pistachios Benefits : పిస్తా పప్పు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. ఇంతకు రోజుకు ఎన్ని తినడం మంచిది?
చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తప్పనిసరి.
Pistachios Benefits : పిస్తా పప్పు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. ఇంతకు రోజుకు ఎన్ని తినడం మంచిది?
Pistachios Benefits : చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. అందుకే ఆరోగ్య నిపుణులు డ్రై ఫ్రూట్స్, ఎక్కువగా తినమని సలహా ఇస్తారు. వీటిలో వేరుశనగలు, బాదం పప్పుల్లాగే పిస్తా కూడా చాలా ప్రయోజనకరం. అయితే చాలామంది పిస్తా తింటే బరువు పెరుగుతామేమో అని అనుకుని, వాటిని తినడానికి ఇష్టపడరు లేదా తక్కువగా తింటారు. కానీ పిస్తా వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలి? ఎప్పుడు తినాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.
పిస్తా పప్పు ఆరోగ్య ప్రయోజనాలు
పిస్తా అనేది కేవలం రుచికి మాత్రమే కాదు, పోషకాలకు కూడా నిలయం. ఇది డ్రై ఫ్రూట్స్ జాబితాలోకి వస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం, ప్రొటీన్ ఉంటాయి. పిస్తా తింటే బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే. ఇందులో ఉండే అధిక పీచు, ప్రొటీన్ వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో ఇతర ఆహారాలు తక్కువగా తింటారు. ఇది ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. పిస్తాలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్, పోషకాలు శరీరంలో మంట, ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
ఎక్కువగా తింటే ప్రమాదమే
నియమితంగా పిస్తా తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఎక్కువగా తినకూడదు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, అతిగా పిస్తా పప్పులు తింటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం ప్రతిరోజూ ఉదయం ఐదు నుంచి ఏడు పిస్తా పప్పులు మాత్రమే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఏడు కంటే ఎక్కువ పిస్తా పప్పులు తింటే, అది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పిస్తా తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
పిస్తా తినడానికి సరైన సమయం
పిస్తా పప్పులు రుచిని పెంచడానికి సహాయపడతాయి కాబట్టి, కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. కానీ, ఏదైనా మితంగా తినడమే మంచిది. పిస్తా తినడానికి ఉదయం సమయం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం తినడం కంటే ఉదయాన్నే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఉదయం టిఫిన్ లేదా అల్పాహారం తీసుకునే ముందు వీటిని తింటే, ఆ రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.