Cough Syrups : 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు వద్దు.. ఆ ప్రమాదం ఉంది.. కేంద్రం హెచ్చరిక
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
Cough Syrups : 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు వద్దు.. ఆ ప్రమాదం ఉంది.. కేంద్రం హెచ్చరిక
Cough Syrups :మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ మరణాలకు దగ్గు సిరప్ సేవించడమే కారణమని మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషాద ఘటనల నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సిఫార్సును చేసింది. 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను ఇవ్వవద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అత్యవసరమైతే తప్ప ఈ సిరప్‌లను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. దగ్గు సిరప్ నమూనాల పరీక్షల్లో డైథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ వంటివి లేవని తేలింది. ఈ పదార్థాలు తీవ్రమైన కిడ్నీ సమస్యలను కలిగించే కలుషితాలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 11 మంది పిల్లలు దగ్గు సిరప్ సేవించిన తర్వాత మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దగ్గు, జలుబు మందులు సేవించిన కొన్ని రోజుల తర్వాత పిల్లలు మూత్రపిండాల సమస్యలతో బాధపడినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిల్లల జనాభాలో దగ్గు సిరప్‌ల వాడకాన్ని తగ్గించాలని సలహా ఇచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడిన జాయింట్ టీమ్ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపింది.
జాయింట్ టీమ్, రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని వివిధ దగ్గు సిరప్‌ల నమూనాలతో పాటు ఇతర నమూనాలను సేకరించింది. పరీక్షా ఫలితాల ప్రకారం, ఏ నమూనాలలో కూడా డైథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ అనే తీవ్ర మూత్రపిండాల హాని కలిగించే కలుషితాలు లేవని తేలింది.
మధ్యప్రదేశ్ SFDA నిర్ధారణ: మధ్యప్రదేశ్ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మూడు నమూనాలను పరీక్షించి DEG/EG అంశాలు లేవని ధృవీకరించింది. పుణెలోని NIV నుండి మరిన్ని రక్తం/CSF నమూనాలను సాధారణ వ్యాధికారకాల కోసం పరీక్షించగా, ఒక కేసులో లెప్టోస్పైరోసిస్ ఉన్నట్లు కనుగొనబడింది.
కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ సునీతా శర్మ 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌ల సాధారణ వాడకం గురించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చారు. దగ్గు, జలుబు మందులను 2 సంవత్సరాల లోపు పిల్లలకు సిఫార్సు చేయకూడదు లేదా పంపిణీ చేయకూడదు. వీటిని సాధారణంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా సిఫార్సు చేయరు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, సరైన మోతాదుకు అనుగుణంగా సిరప్‌ను ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. వైద్యుల సలహా లేకుండా పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు సిరప్‌లను ఇవ్వకూడదని ఈ సూచనల సారాంశం.