Sleeping Disorder : నిద్రకు ముందు ఈ ఆహారాలు మానుకోండి.. జాగ్రత్త పడకపోతే అంతే!
Sleeping Disorder: కంటి నిండా నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇది ముమ్మాటికీ నిజమే. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే ఆహారంతో పాటు నిద్ర కూడా సరిగ్గా పోవాలి.
Sleeping Disorder: కంటి నిండా నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇది ముమ్మాటికీ నిజమే. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే ఆహారంతో పాటు నిద్ర కూడా సరిగ్గా పోవాలి. కానీ, ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. ఒక మనిషి తగినంత నిద్ర పోకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు పిలవకుండానే వస్తాయి. మనం తినే ఆహారానికి, నిద్రకు చాలా సంబంధం ఉంటుంది. అందుకే నిద్ర సరిగా పట్టకపోవడానికి మనం తినే ఆహారం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే, డాక్టర్లు నిద్రపోయే ముందు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండమని చెబుతారు. మరి ఏ ఆహారాలు మన నిద్రను పాడు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.
1. మాంసాహారం
సాధారణంగా మాంసంలో కొవ్వు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట మాంసాహారం తినకుండా ఉండటం మంచిదని చెబుతారు. రాత్రిపూట భారీ భోజనం నిద్రకు భంగం కలిగిస్తుంది.
2. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం
రోజులో ఏ సమయంలో అయినా సరే, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తింటే కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. అందులోనూ, రాత్రిపూట భోజనంలో మసాలాలు ఎక్కువ తింటే, అరగడం మరింత కష్టంగా మారుతుంది. ఇది ఎసిడిటీ సమస్యలకు కూడా దారితీయవచ్చు. దీనివల్ల నిద్ర పట్టదు.
3. టీ లేదా కాఫీ
కొంతమంది రాత్రి భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ రెండింటిలోనూ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. నిద్రపోయే ముందు టీ లేదా కాఫీ తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. అంతేకాదు, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా ఇది కారణమవుతుంది. అందుకే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో కాఫీ తాగండి. కానీ రాత్రి సమయంలో వీటిని తాగడం అస్సలు మంచిది కాదు.
4. జంక్ ఫుడ్
ఎక్కువ మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే జంక్ ఫుడ్ సులభంగా అరగదు. అందుకే రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా, ఈ రకమైన అలవాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. నిద్ర సరిగా పట్టకపోతే మీ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాలు పడతాయి. అందుకే, నిద్రపోయే ముందు ఈ ఆహారాలకు దూరంగా ఉండి. ప్రశాంతమైన నిద్రను పొందండి.