New Guidelines : బ్యూటీ పార్లర్, సెలూన్ సెంటర్లకు కఠిన నిబంధనలు.. త్వరలో కొత్త మార్గదర్శకాలు
New Guidelines : చాలా సెలూన్‌లు, బ్యూటీ పార్లర్లలో అర్హత లేని వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు. చాలామంది ప్రజలు ఫేషియల్స్ సహా చర్మానికి సంబంధించిన అనేక చికిత్సలను చేయించుకుంటున్నారు.
New Guidelines : చాలా సెలూన్‌లు, బ్యూటీ పార్లర్లలో అర్హత లేని వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు. చాలామంది ప్రజలు ఫేషియల్స్ సహా చర్మానికి సంబంధించిన అనేక చికిత్సలను చేయించుకుంటున్నారు. కానీ, సరైన శిక్షణ పొందిన నిపుణులు లేకుండానే చాలా చోట్ల పార్లర్ల పేరుతో దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఏది అసలు, ఏది నకిలీ అని తెలియక ప్రజలు ఈ సెంటర్లకు వెళుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో బ్యూటీ పార్లర్, సెలూన్ సెంటర్, స్కిన్ సెంటర్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు చికిత్స అందించే దుకాణాలు చాలా ఉన్నాయి.
అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న బ్యూటీ పార్లర్లు
కొన్ని బ్యూటీ పార్లర్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్-బేస్డ్ మందులు, క్రీమ్‌లు, సౌందర్య సాధనాలను ఉపయోగించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. సెలూన్ సెంటర్లలో కూడా వైద్య చికిత్సలకు సంబంధించిన పద్ధతులను అనుసరించి ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయకుండానే కొందరు బ్యూటీ క్లినిక్లలో రసాయన చికిత్సలను అందిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలో ఎండీ, డీఎన్‌బీ, డీవీఎల్, డీడీవీ, ఎంసీహెచ్ వంటి పీజీ అర్హతలు లేకుండానే చికిత్సలు చేస్తున్నారు.
కొత్త మార్గదర్శకాలకు ఆరోగ్య శాఖ యోచన
దీనివల్ల చాలామంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇది వారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయడానికి ఆరోగ్య శాఖ ముందుకు వచ్చింది. సెలూన్ సెంటర్లకు, మసాజ్ సెంటర్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడానికి యోచిస్తోంది. దీనిపై చాలా ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు చేపట్టింది.
ఆరోగ్యానికి భరోసా, డబ్బు ఆదా
ఆరోగ్య శాఖ నిర్ణయాన్ని చర్మవ్యాధి నిపుణుల సంఘం స్వాగతించింది. గతంలో కూడా అనేకసార్లు ఆరోగ్య శాఖకు ఈ సంఘం ఫిర్యాదు చేసింది. ఈ మార్గదర్శకాల వల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చని చర్మవ్యాధి నిపుణుల సంఘం సభ్యుడు జగదీష్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా మార్గదర్శకాలకు సంబంధించిన అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి, త్వరలో సెలూన్, బ్యూటీ పార్లర్లకు నిబంధనలు అమలులోకి రానున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే, లైసెన్స్‌ను రద్దు చేయడంపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.