Health Tips : మెడ, కళ్ళపై గ్యాడ్జెట్ల ప్రభావం..డిజిటల్ యుగంలో మీ ఆరోగ్యం జాగ్రత్త
Health Tips : మనం రోజూ వాడే మొబైల్, ల్యాప్‌టాప్‌లు మనకు టెక్ నెక్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి సమస్యలను కానుకగా ఇస్తున్నాయి.
Health Tips : మనం రోజూ వాడే మొబైల్, ల్యాప్‌టాప్‌లు మనకు టెక్ నెక్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి సమస్యలను కానుకగా ఇస్తున్నాయి. మొబైల్ చూస్తున్నప్పుడు మెడను 45 నుంచి 60 డిగ్రీల కోణంలో వంచడం వల్ల వెన్నెముకపై సుమారు 27 కిలోల బరువు పడుతుంది. దీనివల్ల కండరాల నొప్పులు, సెర్వికల్ స్పాండిలైటిస్, నరాల ఒత్తిడి వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు, స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మన నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి, నిద్రలేమికి దారితీస్తుంది.
కళ్ళపై పడే ఒత్తిడిని ఎలా తగ్గించాలి?
మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు కనురెప్పలు వేయడం మరిచిపోతుంటాం. దీనివల్ల కళ్ళు పొడిబారిపోయి, మంటలు, తలనొప్పి వస్తాయి. దీనికి ఉత్తమ పరిష్కారం 20-20-20 రూల్. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి చూపు తిప్పి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఇది కంటి కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. అలాగే కంటికి, స్క్రీన్‌కు మధ్య కనీసం ఒక చేతి దూరం ఉండేలా చూసుకోవాలి.
మెడ నొప్పి రాకుండా ఉండాలంటే..
కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడమే మెడ నొప్పికి ప్రధాన కారణం. ల్యాప్‌టాప్ వాడుతున్నప్పుడు స్క్రీన్ పైభాగం మీ కంటి మట్టానికి సమానంగా ఉండాలి. మెడను వంచి కిందకు చూడకుండా, ఫోన్‌ను కూడా కంటి మట్టానికి ఎత్తులో పట్టుకోవాలి. కుర్చీకి వెనుక వైపు సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. గంటల కొద్దీ కూర్చోకుండా ప్రతి గంటకు ఒకసారి లేచి చిన్నగా అటూ ఇటూ నడవడం లేదా మెడకు సంబంధించిన లఘు వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి.
నిద్రపోయే ముందు ఈ తప్పులు చేయకండి
చాలామందికి మంచం మీద పడుకుని చీకట్లో ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఇది కంటిపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే డిజిటల్ పరికరాలకు స్వస్తి చెప్పాలి. ఇది మీ మెదడుకు ప్రశాంతతను ఇచ్చి, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను కళ్ళకు ఇబ్బంది కలగకుండా సర్దుబాటు చేసుకోవడం, నైట్ మోడ్ ఫీచర్‌ను వాడటం వల్ల కొంతవరకు మేలు జరుగుతుంది.