Dengue : డెంగీకి మందు ఉందా ? ఎయిమ్స్ సైంటిస్టుల పరిశోధనలో కీలక అంశాలు

Update: 2025-08-12 09:30 GMT

 Dengue : డెంగీకి మందు ఉందా ? ఎయిమ్స్ సైంటిస్టుల పరిశోధనలో కీలక అంశాలు

Dengue : సాధారణ జ్వరం మాదిరిగా కాకుండా డెంగీ జ్వరం మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. కేవలం ఒళ్లు నొప్పులు, తీవ్రమైన జ్వరం మాత్రమే కాకుండా, డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఒక తెలివైన వ్యూహాన్ని అనుసరిస్తుంది. అది శరీరంలోని రక్షణ కవచాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ఈ వైరస్ ఇంత తెలివిగా ఎలా వ్యవహరిస్తుంది? దీన్ని మన శరీరం గుర్తించి అడ్డుకోలేదా? ఈ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతుకుతూ ఎయిమ్స్ వైద్యులు ఒక కీలక పరిశోధనను చేశారు.

ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై చేసిన పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. మన శరీరంలోని ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ RBMXను డెంగీ వైరస్ తన ఎదుగుదలకు ఉపయోగించుకుంటుందని గుర్తించారు. ఈ ప్రొటీన్ లభ్యత పెరిగితే, వైరస్ మరింత వేగంగా శరీరంలో విస్తరిస్తుంది. అయితే, మన శరీరాన్ని ఈ వైరస్ నుంచి రక్షించడానికి మరో కీలకమైన మాలిక్యూల్ ఉంది. దాని పేరు miR-133a. ఇది ఒక రకమైన మైక్రో ఆర్ఎన్ఏ . ఈ miR-133a మాలిక్యూల్ డెంగీ వైరస్ పెరగడానికి తోడ్పడే RBMX ప్రొటీన్‌ను నియంత్రిస్తుంది. అంటే, ఇది వైరస్‌ను పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిపై జనరల్ ఆఫ్ మెడికల్ వైరాలజీలో ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు.

ఈ పరిశోధన ప్రకారం డెంగీ వైరస్ శరీరంపై దాడి చేసిన మొదటి కొన్ని గంటల్లోనే మన శరీరంలో ఒక రకమైన పోరాటం జరుగుతుంది. డెంగీ వైరస్ తన సంఖ్యను పెంచుకోవడానికి RBMX ప్రొటీన్‌ను ప్రేరేపిస్తే, మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన miR-133a దాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో వైరస్ గెలిస్తే, miR-133a బలహీనపడి, RBMX ప్రొటీన్ పెరిగి, వైరస్ విజృంభిస్తుంది. ఈ పోరాటంలో మన శరీరం ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎయిమ్స్ వైద్యులు పరిశోధనలో దీనికి ఒక పరిష్కారాన్ని చూపించారు. వారు కృత్రిమ పద్ధతుల్లో డెంగీ సోకిన కణాల్లో miR-133a మాలిక్యూల్ సంఖ్యను పెంచారు. ఫలితంగా, డెంగీ వైరస్ దాని సంఖ్యను పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. miR-133a సంఖ్య పెరిగినప్పుడు వైరస్ తన రెప్లికాలను సులభంగా తయారు చేసుకోలేదని స్పష్టమైంది.

ల్యాబ్ పరీక్షల్లో miR-133a ను కృత్రిమంగా పెంచినప్పుడు లేదా RBMX ప్రొటీన్‌ను నిరోధించినప్పుడు వైరస్ చాలా ఇబ్బందులు పడినట్లు గుర్తించారు. దీనివల్ల miR-133a ను పెంచే లేదా RBMX ను నిరోధించే ఒక మార్గాన్ని కనుగొంటే, డెంగీ వైరస్ తన తెలివితేటలను ఉపయోగించుకోలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రస్తుతం డెంగీని పూర్తిగా నయం చేసే ప్రత్యేకమైన మందు అంటూ ఏదీ లేదు. లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తున్నారు. కానీ, ఈ పరిశోధన ఫలితాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో డెంగీ వైరస్‌ను వేరుగా లక్ష్యంగా చేసుకుని, దాని ఎదుగుదలను పూర్తిగా అడ్డుకునే ఒక కొత్త ఔషధాన్ని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కొంత సమయం పట్టవచ్చు.. కానీ డెంగీని సమూలంగా నిర్మూలించగలిగే రోజు త్వరలోనే రావచ్చు.

Tags:    

Similar News