Health Tips : రాత్రి నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? అయితే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే
Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం.
Health Tips : రాత్రి నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? అయితే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే
Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది రాత్రిపూట పదే పదే నిద్రలేస్తూ ఇబ్బంది పడుతుంటారు. దీనిని కేవలం నిద్రలేమి సమస్యగా మాత్రమే చూడకూడదని, ఇది ప్రాణాంతకమైన గుండె జబ్బులకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన ప్రకారం.. రాత్రిపూట పదే పదే నిద్రలో మెలకువ రావడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు మన గుండె విశ్రాంతి తీసుకుంటుంది, రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. కానీ నిద్రకు తరచుగా ఆటంకం కలిగితే, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో వాపులు రావడం, రక్తనాళాలు దెబ్బతినడం వంటివి జరిగి చివరికి అది హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిత్యం రాత్రిపూట 2 నుంచి 3 సార్లు మెలకువ వచ్చే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది.
మీ మెదడు ఇంకా మేల్కొనే ఉందా?
మీరు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ మీ మెదడు అత్యంత చురుగ్గా పని చేయడం వల్లే పదే పదే మెలకువ వస్తుంది. దీనికి ప్రధాన కారణం మితిమీరిన ఆలోచనలు లేదా మానసిక ఒత్తిడి. మనసులో ఏదో తెలియని ఆందోళన ఉన్నప్పుడు మెదడు శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వదు. ఫలితంగా గాఢ నిద్ర కరువవుతుంది. శరీరానికి తనను తాను మరమ్మతు చేసుకునే సమయం దొరకదు. ఇది కేవలం అలసటకే కాదు, దీర్ఘకాలంలో అధిక రక్తపోటు మరియు ఇతర ప్రమాదకరమైన వ్యాధులకు మూలమవుతుంది. ప్రతి మనిషికి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిరంతర నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు.
ఎవరికి ఈ ప్రమాదం ఎక్కువ?
ముఖ్యంగా స్లీప్ అప్నియా(నిద్రలో శ్వాస ఆడకపోవడం) సమస్య ఉన్నవారిలో, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే పడుకునే ముందు గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడటం, టీవీలు చూడటం వల్ల ఆ వెలుతురు మెదడును మేల్కొనేలా చేస్తుంది. రాత్రిపూట టీ లేదా కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇవన్నీ కలిసి మీ నిద్రను ముక్కలు చేసి, గుండెను బలహీనపరుస్తాయి.
నిద్రను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు
ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. పడుకోవడానికి గంట ముందే మొబైల్, లాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట కెఫీన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. నిద్రపోయే ముందు కాసేపు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి గాఢ నిద్ర పడుతుంది. ఒకవేళ ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.