Bloating: పొట్ట ఉబ్బరాన్ని లైట్‌గా తీసుకోవొద్దు – ప్రాణాంతక వ్యాధుల సంకేతం కావచ్చు!
మన శరీరం ఒక క్లిష్టమైన వ్యవస్థ. ఒక భాగంలో కనిపించే లక్షణం, మరొక చోటున్న సమస్యకు సంకేతం కావచ్చు. పొట్ట ఉబ్బరం కూడా అలాంటిదే. చాలామంది దీన్ని గ్యాస్ లేదా అజీర్ణం సమస్య అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యాలకు సూచన కావచ్చు.
Bloating: పొట్ట ఉబ్బరాన్ని లైట్‌గా తీసుకోవొద్దు – ప్రాణాంతక వ్యాధుల సంకేతం కావచ్చు!
మన శరీరం ఒక క్లిష్టమైన వ్యవస్థ. ఒక భాగంలో కనిపించే లక్షణం, మరొక చోటున్న సమస్యకు సంకేతం కావచ్చు. పొట్ట ఉబ్బరం కూడా అలాంటిదే. చాలామంది దీన్ని గ్యాస్ లేదా అజీర్ణం సమస్య అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యాలకు సూచన కావచ్చు. ముఖ్యంగా ఆహార కారణం లేకుండా పొట్ట ఉబ్బితే, కడుపు నొప్పి, అలసట, బరువులో మార్పులు, ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గట్-బ్రెయిన్ యాక్సిస్
పొట్ట ఉబ్బరానికి ఎక్కువగా గ్యాస్, అజీర్ణం లేదా మలబద్ధకం కారణమవుతాయి. అయితే జీర్ణ వ్యవస్థలోని కండరాలు, నరాల మధ్య సరైన సమన్వయం లేకపోయినా ఇలా జరగొచ్చు. డయాఫ్రం, కడుపు కండరాలు సరిగా పనిచేయకపోతే కూడా గ్యాస్ లేకుండానే పొట్ట ఉబ్బినట్లు అనిపిస్తుంది. స్ట్రెస్, ఆందోళన కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. దీనినే "గట్-బ్రెయిన్ యాక్సిస్" అంటారు.
హార్మోన్ల సమస్యలు
పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు కూడా కడుపు ఉబ్బరానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు ఇది అండాశయ క్యాన్సర్ మొదటి లక్షణం కావచ్చు. అలాగే పెరిమెనోపాజ్, మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు కూడా జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
జీర్ణక్రియలో సమస్యలు
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS), క్రోన్స్ డిసీజ్ వంటి సమస్యలు పొట్ట ఉబ్బరానికి దారి తీస్తాయి. గ్లూటెన్ తట్టుకోలేని వారికి వచ్చే సిలియాక్ డిసీజ్ కూడా కారణం అవుతుంది. అంతేకాదు, చిన్నపేగులో బ్యాక్టీరియా అధికం కావడం వల్ల వచ్చే SIBO కూడా బ్లోటింగ్‌కు కారణం అవుతుంది.
ఫుడ్ అలర్జీలు
లాక్టోస్, ఫ్రక్టోస్ తట్టుకోలేని వారిలో పొట్ట ఉబ్బర సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పాంక్రియాస్‌లో ఎంజైమ్‌లు సరిపడా ఉత్పత్తి కాకపోతే కూడా జీర్ణక్రియ మందగిస్తుంది. కొంతమంది వద్ద పరాన్నజీవులు (పారాసైట్స్) వల్ల కూడా పొట్టలో ఉబ్బరం, తిమ్మిర్లు వస్తాయి. అలాగే, ఒవేరియన్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు ఉన్నప్పుడు పొట్టపై ఒత్తిడి పెరిగి బ్లోటింగ్ అనిపిస్తుంది.
కాలేయం, గుండె సమస్యలు
లివర్ సిర్రోసిస్, గుండె జబ్బుల వల్ల పొట్టలో నీరు చేరుతుంది. దీన్ని అసైటిస్ అంటారు. ఈ సమయంలో పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా స్క్లెరోడెర్మా అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల శరీరంలో అధిక కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల చర్మం, అంతర్గత అవయవాల టిష్యూలు గట్టిపడతాయి, పొట్టలో వాపు ఏర్పడుతుంది.
ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
పొట్ట ఉబ్బరం పదే పదే వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, జ్వరం, మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి సీరియస్ సమస్యలకు సంకేతాలు కావచ్చు.
జాగ్రత్తలు
డైట్ లేదా లైఫ్‌స్టైల్ మార్పులతో బ్లోటింగ్ తగ్గకపోతే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. వైద్యులు అవసరమైన టెస్టులు చేసి, అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్సను సూచిస్తారు. స్వయంగా మందులు వేసుకోవడం మాత్రం ప్రమాదకరం.