Chewing Gum: చ్యూయింగ్ గమ్ తింటే ప్లాస్టిక్ మింగుతున్నట్టేనా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

Chewing Gum: చాలామందికి చ్యూయింగ్ గమ్ అంటే చాలా ఇష్టం.

Update: 2025-05-13 10:30 GMT

Chewing Gum : చ్యూయింగ్ గమ్ తింటే ప్లాస్టిక్ మింగుతున్నట్టేనా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

Chewing Gum: చాలామందికి చ్యూయింగ్ గమ్ అంటే చాలా ఇష్టం. కొందరికి అది మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేస్తే, మరికొందరికి స్వీట్‌నర్‌లా ఉంటుంది. కానీ మీరు కూడా చ్యూయింగ్ గమ్ తినే అలవాటు ఉన్నవారైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చ్యూయింగ్ గమ్ తినడం ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. మీరు చ్యూయింగ్ గమ్ నములుతూ తెలియకుండానే వేల సంఖ్యలో చిన్న ప్లాస్టిక్ ముక్కలను మింగుతున్నారా? అసలు మనం నములుతున్నది ప్లాస్టిక్కేనా? చాలామంది చ్యూయింగ్ గమ్‌కు, ప్లాస్టిక్‌కు మధ్య తేడా ఏముంటుందని ఆలోచిస్తుంటారు.

చ్యూయింగ్ గమ్ అంటే ఏమిటి?

చ్యూయింగ్ గమ్‌లో ముఖ్యంగా ఉండేది గమ్ బేస్. పూర్వకాలంలో ఈ గమ్ బేస్‌ను సహజ సిద్ధమైన పదార్థాలైన చికల్ (ఒక రకమైన చెట్టు రెసిన్) నుంచి తయారు చేసేవారు. కానీ ఇప్పుడు చాలా చ్యూయింగ్ గమ్‌లలో గమ్ బేస్‌ను కృత్రిమ పాలిమర్‌లతో తయారు చేస్తున్నారు. ఇవి దాదాపు ప్లాస్టిక్‌లాంటివే.

సాధారణంగా గమ్ బేస్‌లో ఏమేమి ఉంటాయి?

  • పోలీవినైల్ అసిటేట్ (Polyvinyl Acetate)
  • పోలీఇథైలీన్ (Polyethylene)
  • రబ్బరు లేదా రెసిన్
  • ప్లాస్టిసైజర్ (మెత్తబరిచే పదార్థాలు)

ఇవన్నీ సింథటిక్ మెటీరియల్స్. వీటినే ప్లాస్టిక్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు. తాజాగా జరిగిన పరిశోధనలు, అధ్యయనాలలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీ లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రకారం: ఒక గ్రాము చ్యూయింగ్ గమ్ నుంచి సగటున 100 మైక్రోప్లాస్టిక్ ముక్కలు విడుదలవుతాయి. కొన్ని గమ్‌ల నుంచి 600 కంటే ఎక్కువ ముక్కలు కూడా రావచ్చు. ఒక సాధారణ చ్యూయింగ్ గమ్ ముక్క దాదాపు 1.5 గ్రాములు ఉంటుంది. దీని ప్రకారం రోజు చ్యూయింగ్ గమ్ నమిలే వ్యక్తి ప్రతి సంవత్సరం దాదాపు 30,000 మైక్రోప్లాస్టిక్ కణాలను మింగవచ్చు. చ్యూయింగ్ గమ్‌లో ఉపయోగించే పాలిమర్‌లు గమ్‌ను నమలడానికి మంచిగా చేస్తాయి. ఇవి తరచుగా పెట్రోలియం నుంచి తయారైన సింథటిక్ ప్లాస్టిక్‌లు. అయితే కొన్ని గమ్‌లలో చెట్ల జిగురుతో తయారైన సహజ పాలిమర్‌లు కూడా ఉంటాయి. ఈ రెండు రకాల గమ్‌లలోనూ మైక్రోప్లాస్టిక్‌లు కనుగొనబడ్డాయి. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల లాలాజలంతో కలిసి నోట్లోకి వచ్చి, తర్వాత మింగబడతాయి. వీటిలో కొన్ని నానోప్లాస్టిక్‌లుగా కూడా ఉంటాయి. ఇవి మరింత చిన్నవిగా ఉండి శరీర కణాల వరకు చేరుకోగలవు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు.

ఈ రోజుల్లో చ్యూయింగ్ గమ్‌లలో ప్లాస్టిక్‌లాంటి సింథటిక్ పదార్థాలే ఉంటున్నాయి. అయితే వీటిని తినడానికి సురక్షితమైనవిగా భావిస్తారు. వీటిని మింగకూడదు. కేవలం నమలడానికి మాత్రమే వీటిని తయారు చేస్తారు. అయితే తర్వాతి ప్రశ్న - చ్యూయింగ్ గమ్ తినడం సురక్షితమేనా? చ్యూయింగ్ గమ్‌ను నమలడం సురక్షితమే కానీ, దానిని మింగకూడదు. ఒకవేళ పొరపాటున మింగినా, సాధారణంగా అది జీర్ణం కాకుండా శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది. కానీ ఎక్కువగా మింగడం హానికరం కావచ్చు. 

Tags:    

Similar News