2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన .. ఇంకా రద్దుకాలేదా ? ఇంకా ప్రజల వద్దే రూ. 6 వేల కోట్ల విలువైన నోట్లు!
2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన .. ఇంకా రద్దుకాలేదా ? ఇంకా ప్రజల వద్దే రూ. 6 వేల కోట్ల విలువైన నోట్లు!
రూ. 2000 నోట్లు చట్టబద్ధమే: ప్రజల వద్దే రూ. 6,181 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం
Rs 2000 Notes Exchange Last Date: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా ప్రకటన ప్రకారం, రూ. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించినప్పటికీ, ఇప్పటికీ సుమారు రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు వెల్లడించింది. 2023 మే 19న ఈ నోట్లను చలామణి నుంచి అధికారికంగా ఉపసంహరించినట్లు RBI ప్రకటించింది. అయితే, ఈ నోట్లు ఇంకా చట్టబద్ధమైన కరెన్సీగా (లీగల్ టెండర్) కొనసాగుతున్నాయని స్పష్టంగా తెలిపింది. అంటే, లావాదేవీల్లో వీటిని ఉపయోగించవచ్చు కానీ వాటిని స్వీకరించాలన్నది వ్యక్తిగత, వ్యాపార అవసరాలపై ఆధారపడుతుంది. కొత్తగా ముద్రణను మాత్రం నిలిపివేశారు.
2023 మేలో, రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉండగా, 2025 మే 31 నాటికి వాటిలో 98.26 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇది ఉపసంహరణ ప్రక్రియ విజయవంతమైందని RBI స్పష్టం చేసింది.
ప్రస్తుతం సాధారణ బ్యాంకుల ద్వారా ఈ నోట్లను మార్చుకునే అవకాశం 2023 అక్టోబర్ 7తో ముగిసినప్పటికీ, RBIకి చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో నేరుగా డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకోవడం ఇంకా కొనసాగుతోంది. అంతేకాకుండా, ఇండియా పోస్ట్ ద్వారా ఆర్‌బీఐ కార్యాలయాలకు నోట్లు పంపించి బ్యాంక్ ఖాతాలో జమ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
అంతిమంగా చెప్పాలంటే, రూ. 2 వేల నోట్లు రద్దు కాలేదు. అవి చట్టబద్ధంగానే ఉన్నాయి. మీరు వాటిని ఇంకా వాడకపోతే, ఆర్‌బీఐ సూచించిన ప్రక్రియ ద్వారా మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆందోళన అవసరం లేదు.