విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ...తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

Update: 2019-04-27 03:53 GMT

ఇంటర్మీడియట్‌ ఫలితాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, తదనంతర పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్సీ మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఇంటర్మీడియట్‌ పరీక్ష నిర్వహణలో లోపాల తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. గతకొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇది తలదించుకోవాల్సిన సంఘటన అని తీవ్రంగా ఆక్షేపించింది.

పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాక ఒకవైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాల ఆందోళనలు చేస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మీడియాలో విమర్శనాత్మక కథనాలు ప్రసారం అయ్యాయి. కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాల్లో లేవనెత్తిన అంశాలు నిజమైతే అందుకు కారణమైన అధికారులు మానవహక్కులను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది.

దీనికి బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం చేశారో తెలియజేస్తూ సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించింది. నివేదికను నాలుగు వారాల్లోగా అందజేయాలని కమిషన్‌ స్పష్టం చేసింది. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా బలమైన విధానాలు అమలు చేయాలని సూచించింది.

మరోవైపు ఇంటర్మీడియట్‌ పరీక్ష నిర్వహణా వైఫల్యంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇవాళ అందజేయనుంది. గ్లోబరీనా సంస్థ ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యమే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ ఇచ్చే నివేదికపైనే ఉత్కంఠ నెలకొంది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.  

Similar News