టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతపై దాడి.. నెల్లూరులో ఉద్రిక్తత

Update: 2019-04-15 09:09 GMT

నెల్లూరులో వైసీపీ, టీడీపీల మధ్య చెలరేగిన హింస చల్లారడం లేదు. ఇరు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తూ ఉండటంతో పరిస్ధితులు నివురుగప్పిన నిప్పులా మారింది. టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో చంటి బిడ్డతో వచ్చిన తిరుమల నాయుడు భార్య వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ కార్యాలయం ఎదుట భైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వందలాది మంది టీడీపీ కార్యాకర్తలు అక్కడకు చేరుకుని వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుని పోటీగా నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. పరిస్ధితులు చేయి దాటుతున్నాయని గ్రహించిన పోలీసులు తిరుమల నాయుడు భార్యను బలవంతంగా ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మద్ధతుదార్లు దాడి చేయడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తను స్ధానికులు ఆసుపత్రికి తరలించారు.


 

























 


Similar News