Venezuela Interim President: పుట్టపర్తి భక్తురాలికి అధ్యక్ష పీఠం..వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాబా శిష్యురాలు!
Venezuela Interim President: అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
Venezuela Interim President: అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసిన దరిమిలా, ఆ దేశ సుప్రీంకోర్టు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డిల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. అయితే, ఆమె రాజకీయ ప్రస్థానం కంటే ఇప్పుడు ఆమెకు భారతదేశం, ముఖ్యంగా పుట్టపర్తి సత్యసాయి బాబాతో ఉన్న ఆధ్యాత్మిక బంధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పుట్టపర్తితో విడదీయరాని అనుబంధం
డిల్సీ రోడ్రిగ్స్ కేవలం వెనెజువెలా రాజకీయ నాయకురాలే కాదు, శ్రీ సత్యసాయి బాబాకు పరమ భక్తురాలు. ఆమె గతంలో పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. 2023 ఆగస్టులో మరియు ఇటీవలే 2024 అక్టోబర్ 26న ఆమె పుట్టపర్తిలో పర్యటించారు.
సాయి కుల్వంత్ మందిరంలోని బాబా మహాసమాధిని దర్శించుకుని ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ సమయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆమెకు ఆశ్రమ సేవా కార్యక్రమాలను వివరించారు. "బాబా సన్నిధిలో గడపడం నాకు వర్ణించలేని మానసిక శాంతిని ఇస్తుంది" అని ఆమె గతంలో వ్యాఖ్యానించారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
రోడ్రిగ్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆమె పుట్టపర్తి ఆశ్రమంలో సాధారణ భక్తురాలిలా కూర్చుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక దేశాధినేత స్థాయి వ్యక్తి భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఇంతటి భక్తిని చాటుకోవడం విశేషం.
వెనెజువెలాలో భారతీయ ఆధ్యాత్మికత
వెనెజువెలాలో కేవలం డిల్సీ రోడ్రిగ్స్ మాత్రమే కాదు, వేల సంఖ్యలో సత్యసాయి భక్తులు ఉన్నారు. అక్కడ బ్రహ్మకుమారీలు, రాధాస్వామి వంటి ఆధ్యాత్మిక సంస్థలకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు భారతీయ సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి దేశ అత్యున్నత పదవిని చేపట్టడంతో, భారత్-వెనెజువెలా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.