Donald Trump: అమెరికాలో పిల్లల్ని కనాలనుకునే వారిపై ఆంక్షలు

అమెరికాలో జన్మనివ్వడం ద్వారా తమ పిల్లలకు ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్‌ సర్కార్‌ ఆంక్షలు విధించనుంది.

Update: 2020-01-24 10:25 GMT

వాషింగ్టన్‌: అమెరికాలో జన్మనివ్వడం ద్వారా తమ పిల్లలకు ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్‌ సర్కార్‌ ఆంక్షలు విధించనుంది. ప్రసవం కోసం అమెరికాకు వచ్చే మహిళలను ఇతర విదేశీయులుగానే పరిగణించనుంది. ఈ మేరకు తాము వైద్య చికిత్స కోసం అమెరికా వస్తున్నామని అందుకు తగిన డబ్బు తమ వద్ద ఉందని మహిళలు నిరూపించుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రసవాల కోసం అమెరికా వెళ్లడం చట్టబద్ధమే అయినా బర్త్‌ టూరిజం ఏజెన్సీల వీసా మోసాలు, పన్ను ఎగవేత కేసులు విరివిగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

వలసలపై అన్ని రకాలుగా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డను ఆ దేశం బిడ్డగానే పరిగణించాలన్న రాజ్యాంగ నిబంధన ట్రంప్‌ సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆ ఇబ్బందులను అరికట్టేందుకే కొత్త వీసా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నిబంధనలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఏటా ఎంత మంది మహిళలు అమెరికాలో బిడ్డలకు జన్మనిస్తున్నారన్న దానిపై స్పష్టమైన గణాంకాలు లేవు. 2012లో 36వేల విదేశీ మహిళలు అమెరికాలో పిల్లలకు జన్మనిచ్చి తిరిగి స్వదేశాలకు వెళ్లిపోయినట్టు ఓ నివేదిక తెలిపింది

తమకు పుట్టే పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం లభించేలా.. ఆ దేశానికి వెళ్లి పిల్లల్ని కనాలనుకునే మహిళల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు గుమ్మరిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఈ విధంగా.. పిల్లలకు పౌరసత్వం దక్కించుకోవటం కోసమే అమెరికాకు వచ్చే విదేశీ గర్భవతులకు టూరిస్టు వీసాలను అందజేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం గురువారం సవరించింది. అమెరికా రాజ్యాంగం ప్రకా రం.. ఆ దేశంలో జన్మించే శిశువులకు జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని చైనా, రష్యా, భారత్ తదితర దేశాలకు చెందిన మహిళలు ముఖ్యంగా గర్భవతులు అమెరికాలో తమ ప్రసవం జరిగేలా ఆ దేశానికి వెళ్తుంటారు.

దీనివల్ల వారికి జన్మించిన శిశువులకు సహజంగానే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇప్పటివరకూ దీనిపై అమెరికాలో ఆంక్షలు కూడా లేవు. బర్త్‌టూరిజం పేరిట ఇది విస్తృతస్థాయిలో కొనసాగుతూ వచ్చింది. దీనిపైనే ఆధారపడి అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా నడుస్తున్నాయి. అయితే, ట్రంప్ హయాంలో.. అమెరికాకు వలసవచ్చే వారిపై అనేక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, తాజాగా గర్భవతులకు అందించే వీసాలపైనా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. వీటిప్రకారం.. కాన్పు కోసమే వచ్చే గర్భవతులకు వీసాలను ఇవ్వరు. ఒకవేళ వైద్య అవసరాల కోసం అమెరికాకు వస్తున్నామని గర్భవతులు దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆ చికిత్సకు అవసరమైన డబ్బులు, అక్కడ ఉన్నన్నాళ్లు అయ్యే వ్యయం భరించే స్థోమత తమకు ఉందని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News