Passport For Camels : ప్రపంచం నిర్ఘాంతపోయే నిర్ణయం..ఒంటెలకు కూడా పాస్‌పోర్ట్‌లు ఇస్తున్న సౌదీ ప్రభుత్వం
ప్రపంచం నిర్ఘాంతపోయే నిర్ణయం..ఒంటెలకు కూడా పాస్‌పోర్ట్‌లు ఇస్తున్న సౌదీ ప్రభుత్వం
Passport For Camels : సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ మనుషులకే కాదు.. ఒంటెలకు కూడా ప్రత్యేకంగా పాస్‌పోర్ట్‌లు జారీ చేయబోతున్నారు. దేశంలోని లక్షలాది ఒంటెల గుర్తింపును పక్కాగా నిర్వహించేందుకు, వాటి అమ్మకాలు, నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌదీ అరేబియా పర్యావరణ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రకటించింది. దేశంలో దాదాపు 22 లక్షల ఒంటెలు ఉన్నాయని అంచనా. అయితే, వీటి నిర్వహణకు ఇప్పటివరకు ఒక కేంద్రీకృత వ్యవస్థ లేదు. ఒంటెల అమ్మకాలు, వాటి యజమానుల హక్కులను కాపాడటమే కాకుండా, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈ పాస్‌పోర్ట్ ఒక అధికారిక పత్రంగా పనిచేస్తుంది. దీనివల్ల ప్రతి ఒంటెకు సంబంధించిన పూర్తి డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఇది కేవలం ఒక బుక్లెట్ మాత్రమే కాదు, ఒంటెలకు సంబంధించిన హెల్త్ రికార్డులు, బ్రీడింగ్ వివరాలను కూడా ట్రాక్ చేస్తుంది.
సౌదీ సంస్కృతిలో ఒంటెల ప్రాముఖ్యత
అరేబియా చరిత్రలో ఒంటెలకు వేల ఏళ్ల నాటి అనుబంధం ఉంది. సుమారు 7,000 ఏళ్ల కిందటే అక్కడ రాళ్లపై ఒంటెల ఆకృతులను చెక్కారంటే, ఆ కాలం నుంచే వీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎడారి ప్రయాణాలకు, వాణిజ్యానికి ఒంటెలే ప్రధానాధారం. సౌదీలో ఒంటెలను కేవలం జంతువులుగా కాకుండా, ఒక గర్వకారణంగా భావిస్తారు. ఒంటెలను పెంచడం అక్కడ ఒక లాభదాయకమైన వ్యాపారం మాత్రమే కాదు, సామాజిక హోదాను కూడా సూచిస్తుంది.
పాస్‌పోర్ట్ ఎలా ఉండబోతోంది?
ప్రభుత్వం విడుదల చేసిన పాస్‌పోర్ట్ నమూనా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పాస్‌పోర్ట్ మీద సౌదీ అరేబియా జాతీయ చిహ్నంతో పాటు మధ్యలో ఒంటె బొమ్మ బంగారు రంగులో మెరుస్తుంది. దీనివల్ల ఒంటె యొక్క యాజమాన్య హక్కులను నిరూపించడం సులభమవుతుంది. ఎవరైనా ఒంటెను అమ్మాలన్నా లేదా కొనాలన్నా ఇకపై ఈ పాస్‌పోర్ట్ తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది.
అందాల పోటీలు, ఫ్రాడ్‌కు చెక్!
సౌదీలో ప్రతిఏటా ఒంటెల అందాల పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ పోటీల్లో గెలిచిన ఒంటెల యజమానులకు లక్షలాది డాలర్ల బహుమతులు దక్కుతాయి. అయితే, ఈ పోటీల్లో గెలవడం కోసం కొంతమంది ఒంటెలకు కాస్మెటిక్ సర్జరీలు చేయించడం, బొటాక్స్ ఇంజక్షన్లు వాడటం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన ఈ పాస్‌పోర్ట్ గుర్తింపు వ్యవస్థ వల్ల ఒంటెల సహజ రూపాన్ని రికార్డ్ చేయడం కుదురుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు వీలవుతుంది.