Plane Crash : కొలంబియాలో కుప్పకూలిన విమానం.. 110 మంది సైనికులతో వెళ్తుండగా ఘోర ప్రమాదం
Plane Crash : కొలంబియాలో 110 మంది సైనికులతో వెళ్తున్న C-130 హెర్క్యులస్ విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయింది. 20 మందిని రక్షించగా, మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Colombia Plane Crash
Plane Crash : కొలంబియాలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న ఒక సైనిక విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో కుప్పకూలిపోయింది. పెరూ సరిహద్దుకు సమీపంలోని పోర్టో లెగుయిజామో వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన విమానం C-130 హెర్క్యులస్ మోడల్‌కు చెందినది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొలంబియా రక్షణ దళాలకు చెందిన C-130 హెర్క్యులస్ విమానం మంగళవారం ఉదయం పోర్టో లెగుయిజామో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే, రన్‌వే నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో విమానం అదుపు తప్పి పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీగా పొగలు కమ్ముకున్నాయి. స్థానిక మీడియా విడుదల చేసిన చిత్రాల్లో ప్రమాద స్థలంలో మంటలు ఎగసిపడుతుండటం, సైనిక ట్రక్కులు సహాయక చర్యల కోసం పరుగులు తీస్తుండటం కనిపిస్తోంది. ఇప్పటివరకు 20 మంది గాయపడిన సైనికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పాత విమానాలే శాపమా?
ఈ ప్రమాదంపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానంలో ఉన్న సైనికులందరూ సురక్షితంగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే, సైన్యం వాడుతున్న పాత విమానాలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రక్షణ రంగాన్ని ఆధునీకరించడంలో జాప్యం చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ C-130 హెర్క్యులస్ విమానాలను అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ కంపెనీ 1950వ దశకంలో తయారు చేసింది. కొలంబియా వీటిని 1960లలో కొనుగోలు చేసి, అమెరికా నుంచి వచ్చిన పాత విడిభాగాలతోనే అప్‌గ్రేడ్ చేస్తూ వాడుతోంది. ఇదే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని ప్రాథమిక అంచనా.
❗️Colombian Air Force C-130 Hercules Crashes Near Peru Border, Reportedly With 100+ Personnel Onboard - Local Media
— RT_India (@RT_India_news) March 23, 2026
The Defense Minister has confirmed the incident, but did not specify the number of passengers.
The C-130 Hercules is a tactical transport aircraft manufactured… pic.twitter.com/DRG1goE7XP
వరుస ప్రమాదాల కలకలం
గతంలో కూడా దక్షిణ అమెరికా దేశాల్లో ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగాయి. ఇటీవలే బొలీవియాలోని ఎల్ ఆల్టోలో ఇదే తరహాకు చెందిన C-130 విమానం కూలిపోయి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొలంబియాలో అదే మోడల్ విమానం ప్రమాదానికి గురవ్వడంతో సైనిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. రక్షణ రంగంలో కొత్త టెక్నాలజీని తీసుకురాకపోతే ఇలాంటి ప్రాణ నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఈ ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.