Bank Nifty Crash: బ్యాంకింగ్ షేర్లను ముంచెత్తిన అమ్మకాల సునామీ! హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐ వరకు..
Bank Nifty Crash: ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడిదారుల (FPI) ఉపసంహరణ కారణంగా బ్యాంక్ నిఫ్టీ 1700 పాయింట్లకు పైగా పడిపోయింది. ఈ మార్కెట్ పతనానికి గల ప్రధాన కారణాలను ఈ స్టోరీలో చదవండి.
Bank Nifty Crash: బ్యాంకింగ్ షేర్లను ముంచెత్తిన అమ్మకాల సునామీ! హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఎస్‌బీఐ వరకు..
Bank Nifty Crash: వారపు మొదటి రోజే స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ రంగం భారీ కుదుపుకు లోనైంది. సోమవారం స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల సునామీతో బ్యాంక్ నిఫ్టీ సూచీ ఒక్కసారిగా అతలాకుతలమైంది. కేవలం ఒక్క రోజే 3% కంటే ఎక్కువ పతనాన్ని నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది.
3.2% పడిపోయిన బ్యాంక్ నిఫ్టీ..
మధ్యాహ్నం సెషన్ సమయానికి బ్యాంక్ నిఫ్టీ సుమారు 3.2% (1700 పాయింట్లకు పైగా) క్షీణించి 51,968 స్థాయికి పడిపోయింది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండూ ఈ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఉన్నతాధికారి పదవిలో జరిగిన ఆకస్మిక మార్పుతో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతిని ఈ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే ప్రభుత్వ రంగా బ్యాంకులు (PSU Banks) యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) షేర్లు ఏకంగా 4% పైగా క్షీణించాయని నిపుణులు వెల్లడించారు.
పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
1. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం మార్కెట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు $112 దాటగా, యూఎస్ క్రూడ్ $99 వద్ద కొనసాగుతోంది. చమురు ధరలు పెరిగితే దిగుమతి ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం ఎగబాకుతుంది. ఇది వడ్డీ రేట్లపై ఒత్తిడి పెంచి బ్యాంకింగ్ రంగాన్ని నేరుగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు.
2. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ల నుంచి నిధులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. మార్చి నెలలోనే బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, ఇక్కడ షేర్ల లిక్విడిటీ (అమ్మడం) సులభం కావడంతో వారు ఈ రంగాన్నే లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.
3. ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని, సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే..
అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి కొనసాగవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బలమైన పునాదులు ఉన్న బ్యాంకుల షేర్లు పడిపోవడం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక మంచి కొనుగోలు అవకాశంగా మారే ఛాన్స్ ఉందని సూచిస్తున్నారు.