మలేషియాలో తెలుగోళ్ల పాట్లు

Update: 2020-03-17 15:30 GMT
Telugu students stranded at Kuala Lumpur airport

కరోనా‌ ఎఫెక్ట్‌తో తెలుగు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విదేశాల్లో చదుకుంటున్న స్టూడెంట్స్‌ ఇండియా రావడానికి ఇక్కట్లకు గురవుతున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో 300 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. వారు భారత్ రావడానికి విమానాశ్రయ అధికారులు అనుమతించడం లేదు. స్వదేశం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో పలు దేశాల్లో విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌‌లో చదువుకుంటున్న సుమారు 300 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇండియాకు వస్తూ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో నిలిచిపోయారు.

ఇండియా రావడానికి టికెట్లు బుక్ చేసుకున్న విద్యార్థులను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. భారత రాయభార కార్యాలయం అనుమతి లేనిదే విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదని విమానాశ్రయ అధికారులంటున్నారు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

విమానాశ్రయంలో చిక్కుకున్న విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని... తిరిగి ఫిలిప్పీన్స్ వెళ్లాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. తాము స్వదేశం వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.  

Tags:    

Similar News