Pigeon Feeding Fine : పుణ్యం వస్తుందనుకుంటే.. జేబుకు చిల్లు పడింది..పావురాలకు మేత వేసినందుకు రూ.2లక్షల ఫైన్
పుణ్యం వస్తుందనుకుంటే.. జేబుకు చిల్లు పడింది..పావురాలకు మేత వేసినందుకు రూ.2లక్షల ఫైన్
Pigeon Feeding Fine : సింగపూర్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పావురాలకు మేత వేసినందుకు భారత సంతతి మహిళకు కోర్టు భారీ జరిమానా విధించింది. సింగపూర్‌లో పావురాలకు మేత వేయడం ఒక నేరం. భారత సంతతికి చెందిన 71 ఏళ్ల మహిళ షమ్లాకు ఇప్పుడు ఈ విషయం బాగా అర్థమైంది. కేవలం ఆరు నెలల వ్యవధిలో తొమ్మిది సార్లు పావురాలకు మేత వేసినందుకు సింగపూర్ కోర్టు ఆమెకు ఏకంగా 3,200 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.2.27 లక్షలు) జరిమానా విధించింది. ఆ దేశంలోని వైల్డ్‌లైఫ్ యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వ అనుమతి లేకుండా అడవి జంతువులకు లేదా పక్షులకు ఆహారం వేయడం చట్టరీత్యా నేరం.
పదే పదే తప్పు చేస్తే శిక్ష తప్పదు
షమ్లా అనే ఈ మహిళ సింగపూర్ పౌరురాలు. ఆమె టోవా పాయో అనే పురాతన నివాస ప్రాంతంలో నివసిస్తున్నారు. నిజానికి ఆమె ఇలా పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. మే 2025లోనే ఇలాగే పక్షులకు మేత వేస్తూ పట్టుబడితే కోర్టు 1,200 డాలర్ల జరిమానా విధించింది. అప్పట్లో నేషనల్ పార్క్స్ బోర్డ్ అధికారులు పావురాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే, ఆమె వారికి అడ్డుపడి విధులకు ఆటంకం కలిగించారు. అప్పుడు ఇకపై మళ్ళీ చేయను అని కోర్టుకు మాటిచ్చిన బామ్మ, జూలై 2025 నుంచి జనవరి 2026 మధ్య మళ్ళీ 9 సార్లు అదే తప్పు చేస్తూ అధికారులకు దొరికిపోయారు.
కోర్టులో బామ్మ వాదనలు.. కానీ ఫలితం సున్నా
బుధవారం కోర్టుకు హాజరైన షమ్లా తన తప్పును ఒప్పుకున్నారు. అయితే తన వద్ద లాయర్ లేరని, తను నిరుద్యోగి అని, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. జరిమానా మొత్తాన్ని 1,000 నుంచి 2,000 డాలర్ల మధ్య ఉంచాలని, మిగిలిన మొత్తానికి బదులుగా కమ్యూనిటీ సర్వీస్ చేస్తానని వేడుకున్నారు. కానీ పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తుండటంతో కోర్టు ఆమె విన్నపాన్ని తిరస్కరించింది. భారీ జరిమానా విధిస్తేనే ఇలాంటి వారు దారికి వస్తారని అభిప్రాయపడింది. చివరికి విధి లేక ఆ జరిమానా మొత్తాన్ని అదే రోజు చెల్లిస్తానని ఆమె అంగీకరించారు.
ఎందుకీ కఠిన చట్టాలు?
సింగపూర్ ప్రభుత్వం పారిశుద్ధ్యం, పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేస్తుంది. పావురాలు, ఇతర అడవి పక్షులకు ఆహారం వేయడం వల్ల వాటి జనాభా విపరీతంగా పెరిగిపోయి, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తారు. అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ పక్షుల మలం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతుందని ఇలాంటి కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. ఈ చట్టం కింద ఒకసారి తప్పు చేస్తే ఏకంగా 10,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అందుకే సింగపూర్ వెళ్లే పర్యాటకులు లేదా అక్కడ నివసించే వారు ఇలాంటి చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.