Rahul Gandhi's USA Tour: అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ.. రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ
Rahul Gandhi's America Visit: రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. లోక్ సభ ఎన్నికల ముగిసిన తరువాత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో రాహుల్ అమెరికా టూర్‌కి ఒకింత ప్రాధాన్యత ఏర్పడింది. ముందుగా టెక్సాస్‌లోని డల్లాస్ చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడ ఉంటున్న భారతీయులతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతల నుండి ఘన స్వాగతం లభించింది.
ఇదే విషయమై రాహుల్ గాంధీ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు పోస్ట్ చేస్తూ.. డల్లాస్‌లో భారతీయులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికిన తీరు తనకు ఎందో ఆనందాన్నిచ్చిందని అన్నారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా తన పర్యటన ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపారు. సెప్టెంబర్ 8న డల్లాస్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ ఆ తరువాత వాషింగ్టన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు.
రాహుల్ గాంధీ అమెరికా పర్యటన గురించి అంతకంటే ముందే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా స్పందిస్తూ.. అమెరికాలో ఉన్న భారతీయులు, సాంకేతిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్, అమెరికా మీడియా వర్గాలు రాహుల్ గాంధీకి స్వాగతం చెప్పి ఆయనతో మాట కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. అమెరికాలోని రాజకీయ నాయకులు కూడా రాహుల్ గాంధీతో భేటీకి ఆసక్తి చూపిస్తున్నారని శామ్ పిట్రోడా తెలిపారు.
భారత్‌లో ముంబై, పూణె వంటి నగరాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఇక్కడి వారు ఆసక్తి చూపిస్తున్నారని శామ్ పిట్రోడా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇప్పటికే రాహుల్ గాంధీ అమెరికా పర్యటన గురించి ఆరాతీస్తూ చాలామంది తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని.. ఫోన్లు చేస్తున్నారని.. వాళ్లందరికీ సమాధానమే ఈ వీడియో అంటూ శామ్ పిట్రోడా మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు.
2024 లోక్ సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీకి కొంత క్రేజ్ పెరుగుతోందని.. తన మాటలతో వివిధ వర్గాలను ఆకట్టుకోవడంలో రాహుల్ ముందంజ వేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి అమెరికా పర్యటన కూడా రాహుల్ గాంధీకి పనికొచ్చే అవకాశాలు లేకపోలేదు అనేది వారి అభిప్రాయం.