పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌కు అవిశ్వాసగండం.. దిగిపోవాలంటున్న నేతలు...

Pakistan - Political Crisis: 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ...

Update: 2022-03-19 08:10 GMT

పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌కు అవిశ్వాసగండం.. దిగిపోవాలంటున్న నేతలు...

Pakistan - Political Crisis: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సుర్రుసుమ్మైపోతుంది... దిగిపో... పాలించింది చాలంటూ ప్రతిపక్షాలు గర్జిస్తుంటే... వెళ్లవయ్యా... వెళ్లూ అంటూ అధికార పార్టీ నేతలు గళం విప్పుతున్నారు. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి... ఇమ్రాన్ ఖాను ను సాగనంపాలని అక్కడ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయ్.

ఓవైపు విపక్షాలు... మరోవైపు అధికార పార్టీ ఎంపీల నుంచి ప్రతిఘటనతో ఇమ్రాన్ ఖాన్ బెంబేలెత్తిపోతున్నాడు. సొంత పార్టీ నుంచి రెండు డజన్ల ఎంపీలు, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ PML-N, మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPPకి చెందిన దాదాపు 100 మంది సభ్యులు మార్చి 8న నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ ముందు అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదలకు ఇమ్రాన్ నిర్ణయాలే కారణమంటూ విపక్షాలు కస్సుమంటున్నాయ్...

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని మార్చి 21న నిర్వహించి ప్రారంభం కానున్నాయ్. మార్చి 28న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని గతంలో ఎదుర్కొన్న ఇమ్రాన్... ఈసారి సొంత పార్టీ నుంచి విముఖతతో తలపట్టుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రజల్లోనూ నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగనప్పుడు... సొంత పార్టీనైనా విమర్శిస్తామంటున్నారు పీటీఐ నేతలు. సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే ప్రధాని అసలు స్పందించడం లేదంటూ నేతలు మండిపడుతున్నారు.

మరోవైపు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలుస్తున్న ఎంపీలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతలతోపాటు, విపక్ష ఎంపీలకు ముడుపులు ఎరవేసి ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ కాపాడుకోవాలని చూస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వైపుల నుంచి విమర్శలు రేగడంతో... పది లక్షల మందితో ర్యాలీ చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఇమ్రాన్ యత్నిస్తున్నాడు.

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుండగా... అవిశ్వాసం ఆమోదం పొందడానికి 172 ఓట్లు అవసరం ఉంది. అధికార పీటీఐకి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 155 మంది సభ్యులు ఉండగా... పలు ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తున్నాయ్. ప్రభుత్వంలో కొనసాగడానికి కనీసం 172 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా ఓటేయాలి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ 2018లో అధికారంలోకి రాగా... 2023లో తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉంది.

మొత్తం వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ ఉండదని... రాజకీయాల విషయంలో తటస్థంగా ఉంటుందంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చింది అక్కడి మిలిటరీ. ఇటీవల ఆర్మీకి, ఇమ్రాన్ ఖాన్‌కు మధ్య గ్యాప్ పెరుగుతోంది. మనుషులు నిర్ణయాలు ఎప్పుడైనా మార్చుకుంటారని... జంతువులు మాత్రమే మార్చుకోరంటూ చేసిన వ్యాఖ్యలతో అక్కడి కీలక మిలటరీ అధికారులు సైతం మండిపడుతున్నారు. సైన్యం అండతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఇప్పుడు తను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనలో అక్కడ ఆర్మీ ఉంది.

Tags:    

Similar News