గాజా శాంతి ఒప్పందం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి ముగింపు

పశ్చిమాసియాలో శాంతి కపోతాలు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కీలక సంధి శాంతి ఒప్పందంపై సంతకాలు గాజా యుద్ధానికి ఇక ముగింపు బందీల విడుదలకు మార్గం సుగమం

Update: 2025-10-10 07:32 GMT

గాజా శాంతి ఒప్పందం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి ముగింపు

రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు కార్డు పడుతోంది. గాజాలో శాంతి కపోతాలు ఎగరనున్నాయి. యుద్దం ముగించే దిశగా మొదటి దశ శాంతి ఒప్పందం అమలుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ అంగీకరించాయి. ఈ దిశగా తాను చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక అపూర్వ అడుగుగా అభివర్ణించారు. దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కూడా అభినందించారు. ఈ కీలక పరిణామాలపై ఆనందం వ్యక్తం చేస్తూ గాజా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.


పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ ముందుకు వచ్చాయి. ఈజిప్టులో కైరోలో గత మూడు రోజులుగా శాంతి ప్రణాళికపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించింది. యుద్దం ముగించే దిశగా మొదటి దశ శాంతి ఒప్పందం అమలుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ అంగీకరించాయి. వెంటనే ఈ సమాచారం అమెరికా అధ్యక్షునికి చేరింది. ఈ సందర్భంగా జరిగిన కీలక పరిణామాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఓ సమావేశంలో బిజీగా ఉండగా.. విదేశాంగ మంత్రి మార్కో రూబియో హఠాత్తుగా వచ్చారు. ట్రంప్ ఆయన్ని పిలిచి ఏంటని అడగగా చేతితో రాసిన ఓ నోట్‌ను చేతిలో పెట్టారు. ఆ తర్వాత ట్రంప్‌ చెవిలో ఏదో రహస్యంగా చెప్పారు. ‘‘మనం చేరుకున్నాం. ఈ డీల్‌పై ప్రకటనను ట్రూత్‌లో పోస్ట్‌ చేసేందుకు మీ అనుమతి కావాలి’’ అని ఆ నోట్‌లో రాసి ఉంది.


ఈ సమాచారం ట్రంప్‌కు సంతోషాన్ని కలిగించింది. శాంతి ఒప్పందానికి మేం చాలా దగ్గర్లో ఉన్నాం. దానిపై సంతకాలు చేసేందుకు చర్చలు కొలిక్కి వచ్చాయి’’ అని పేర్కొన్నారు.గత రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ఆయన అభివర్ణించారు. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేసినట్లు తెలిపారు. ‘దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చాను’ అంటూ గాజా డీల్‌పై ఆయన పోస్ట్ చేశారు. 


మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్‌, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా భావిస్తున్నాని తెలిపారు ట్రంప్. ఈ నిర్ణయంతో హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది. అన్ని పార్టీలను సమంగా చూస్తాం. అరబ్‌, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్‌, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన జరగడానికి మాతో పాటు కలిసి పనిచేసిన మధ్యవర్తులు ఖతార్‌, ఈజిప్ట్‌, తుర్కియేకు ధన్యవాదాలు’’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.


గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను హమాస్‌ ముందు ఉంచారు. అక్టోబరు 5లోపు ఈ ప్రణాళికకు ఒప్పుకోకుంటే నరకం చూపిస్తానని ఇటీవల హెచ్చరించారు కూడా.. దీంత్ హమాస్‌ వెనక్కి తగ్గి బందీలను విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. తాజాగా కుదిరిన శాంతి ఒప్పందాన్ని హమాస్‌సైతం ధ్రువీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడించింది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్‌, ఈజిప్టు, తుర్కియే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్‌ కృతజ్ఞతలు తెలిపింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోబోమని హమాస్‌ స్పష్టం చేసింది.


హమాస్‌ శాంతి ప్రణాళికకు అంగీకరించకపోతే.. ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చని బహిరంగంగా చెప్పారు డొనాల్డ్ ట్రంప్ . మూడు రోజుల క్రితం అరబ్‌, ముస్లిం దేశాల నేతలతో చర్చలు జరిపి రూపొందించిన ముసాయిదా ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అందించారు అమెరికా అధ్యక్షుడు. అయితే, పాలస్తీనాను దేశంగా పరిగణించేందుకు నెతన్యాహు అంగీకరించలేదు. అప్పటికే ఖతార్‌లో హమాస్‌ సభ్యులపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్‌.. నెతన్యాహుపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది నీకు విజయావకాశం. నీకు మరో ఛాయిస్‌ లేదు. నాతో ఉంటే నువ్వు బాగుంటావ్‌’’ అని ఇజ్రాయెల్‌ ప్రధానిని హెచ్చరించారు.

తాజా ఒప్పందంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఇజ్రాయెల్‌కు గొప్పరోజుగా అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు రేపు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు. ( Netanyahu Tweet)


2023 అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుపడి 1200 మందికిపైగా హతమార్చి, 250 మందికిపైనే బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గాజాపై భీకరంగా విరుచుకుపడి హమాస్‌ ముఖ్య నేతలందరిని హతమార్చింది. గాజా యుద్ధానికి అక్టోబర్‌ 7తో రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 67,183 మంది పాలస్తీనియన్లు మరణించారు. 1,69,841 మంది గాయపడ్డారు. లక్షకుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలవగా, ఇంకా 97 మంది హమాస్‌ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. గాజాలో ఆహార కొరత ఏర్పడి పెద్ద సంఖ్యలో జనం వలసపోయారు. తాజాగా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో గాజాలో సంబరాలు మిన్నంటాయి. పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి కేరింతలు, డాన్సులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.


ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందుకొచ్చారు. ఇందు కోసం ఆయన 20 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. దానిని భారత్‌, రష్యా, చైనా సహా పలు దేశాలు ఆహ్వానించాయి. ఈ చర్చల్లో మొదటి దశ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడంతో కీలక మలుపు చోటు చేసుకుంది. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. 'అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్నెతన్యాహు బలమైన నాయకత్వానికి ప్రతిబింబం కూడా' అని మోదీ పేర్కొన్నారు గాజా ప్రజలకు మానవతా సహాయం చేయడంతో పాటు, బందీలను విడుదల చేయడం వల్ల వారికి ఉపశమనం లభిస్తుందని, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి పునాది పడుతుందని ప్రధానమంత్రి మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.(Modi Tweet on Peace)


మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంత కాలంగా తను నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్టు ట్రంప్‌ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ ట్రంప్‌ను ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది. కాగా, ప్రస్తుతం నోబెల్‌ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి ఈ నెల 10వ తేదీన ప్రకటించాల్సి ఉండగా.. ఈ విషయమై తాజాగా ట్రంప్‌ను మీడియా ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ..‘నాకు అదంతా తెలియదు.. నేను ఏడు యుద్ధాలను పరిష్కరించాను. ఎనిమిదో యుద్ధాన్ని పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నాము. రష్యా పరిస్థితిని మనం పరిష్కరించుకుంటామని నేను అనుకుంటున్నాను. చరిత్రలో ఎవరూ ఇన్ని యుద్ధాలను ఆపలేదు. నోబెల్‌ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నామినేట్‌ చేశాయి. కానీ, నోబెల్‌ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా.. ఒక కారణాన్ని కనుగొంటున్నారు అని విమర్శలు చేశారు.

Tags:    

Similar News