Elon Musk:నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్..!

నోబెల్ శాంతి బహుమతి 2025కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. గతంలోనూ ఓ సారి ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయగా.. మస్క్‌కు బహుమతి లభించలేదు.

Update: 2025-01-30 13:22 GMT

నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్..!

Elon Musk: నోబెల్ శాంతి బహుమతి 2025కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. గతంలోనూ ఓ సారి ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయగా.. మస్క్‌కు బహుమతి లభించలేదు. అయితే ఈ సారి మస్క్‌ పేరును యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ప్రతిపాదించారు.

ఎక్స్, స్పేస్‌ఎక్స్, టెస్లా వంటి కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతి 2025 అభ్యర్థిత్వానికి ఎంపిక అయినట్టు యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు బ్రాంక్ గ్రిమ్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులపై మస్క్ ఎక్స్ వేదికగా తన నిబద్దతను చాటుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందాలని కోరుకుంటున్నట్టు వివరించారు.

జనవరి 29వ తేదీన ఆ అభ్యర్థిత్వాన్ని నోబెల్ కమిటీకి సమర్పించినట్టు బ్రాంకో గ్రిమ్స్ స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. నోబెల్ శాంతి బహుమతి 2024 రేసులో మస్క్ పేరు వినిపించింది. అప్పుడు నార్వేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మారియస్ నీల్సన్.. గతేడాది ఫిబ్రవరి నెలలో మస్క్ పేరును ప్రతిపాదించారు. కానీ అప్పుడు అతనికి ఆ బహుమతి రాలేదు. అయితే ఈ సారైనా ఆయనకు నోబెల్ బహుమతి రావాలని మస్క్ అభిమానులు, మద్దతుదారులు కోరుకుంటున్నారు.

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ప్రతి సంవత్సరం ఆరు విభాగాల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్, లిటరేచర్, శాంతి) నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. అయితే ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్టోబర్ నెల మధ్యలో ఈ బహుమతి కోసం అభ్యర్థుల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరి 31వ తేదీకి గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి మధ్యలో నోబెల్ కమిటీకి నామినేషన్లు సమర్పిస్తే చెల్లుబాటయ్యే నామినేషన్లను మాత్రమే కమిటీ సమీక్షిస్తుంది. ఆ తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. శాశ్వత కన్సల్టెంట్, అంతర్జాతీయ నిపుణుల సాయంతో నోబెల్ బహుమతి విజేతలను గుర్తిస్తుంది.

నోబెల్ బహుమతిని డైనమేట్‌ను కనుగొన్న స్వీడన్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద 1901లో ప్రారంభించారు. మొదట వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేశారు. 1968లో స్వీడన్ బ్యాంక్ 300 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసి.. 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. దీన్ని నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్‌గా పిలుస్తారు. నోబెల్ బహుమతులను డిసెంబర్ 10న నోబెల్ వర్థంతి సందర్భంగా ప్రదానం చేస్తారు. ప్రతి ఏడాది నోబెల్ బహుమతిని ఒక్కో రంగంలో గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు.

Tags:    

Similar News