అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ జీతం ఎంత? కల్పించే సకల సౌకర్యాలు ఏంటో తెలుసా?

Update: 2025-01-20 10:29 GMT

Donald Trump remuneration: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, వివిధరంగాల ప్రముఖులు వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ అందుకునే జీత భత్యాలు ఎంత? అతనికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటి? అధ్యక్షుడికి ఎలాంటి భద్రత ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడు అనగానే ముందుగా గుర్తొచ్చేంది వైట్ హౌస్. దీనినే శ్వేత సౌధం అని కూడా పిలుస్తారు. అమెరికా అధ్యక్షుడిని శ్వేతసౌధానికి అధిపతి అని కూడా అంటారు. ఆరు అంతస్తుల ఈ భవనాన్ని 1800లో నిర్మించారు. తర్వాత కాలక్రమేణా హంగులు జోడించుకుంటూ వస్తున్నారు. 55,000 వేల చదరపు అడుగులు కలిగిన ఈ భవనంలో 132 గదులు, 35 బాత్ రూమ్‌లు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి.

అధ్యక్షుడి భోజనం ఏర్పాట్ల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. అంతేకాదు శ్వేతసౌధం కాకుండా బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం కూడా అధ్యక్షుడికి ఇస్తారు. ఇది శ్వేతసౌధం కంటే పెద్దగా సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్ రూములు, 35 బాత్ రూమ్‌లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్‌ లాంటివి ఉంటాయి.

ప్రెసిడెంట్ జీతానికొస్తే.. అధ్యక్షుడి వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్లు ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం ఇది రూ.3.3 కోట్లు వరకు ఉంటుంది. అంటే నెలకు రూ.28 లక్షల వేతనం అందుతుంది. ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్ 2001లో నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పు లేదు. అమెరికా అధ్యక్షుడు రిటైరయ్యాక కూడా వార్షికంగా 2 లక్షల డాలర్లు అందుకుంటారు. అంతేకాదు 1 లక్ష డాలర్ల అవెన్సు రూపంలో ఇస్తారు.

అమెరికా అధ్యక్షుడి వేతనంతో పాటు, వ్యక్తిగత, అధికారిక ఖర్చుల కోసం ఏటా 50 వేల డాలర్లు (రూ.42 లక్షలు) అందిస్తారు. ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు(రూ.84 లక్షలు), వినోదం కోసం మరో 19 వేల డాలర్లు (రూ.16 లక్షలు) ఇస్తారు. ఇవన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి 5.69 లక్షల డాలర్ల వరకు అందుతుంది. ఇక అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టడానికి ముందు డెకరేట్ చేయడానికి మరో లక్ష డాలర్లు చెల్లిస్తారు.

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించడానికి ఓ ప్రత్యేక విమానాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇదే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం. ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి. ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విమానంలో దాదాపు సకల సౌకర్యాలు ఉంటాయి.

అమెరికా అధ్యక్షుడు స్థానికంగా ప్రయాణించడానికి ఉన్న హెలికాప్టర్ పేరు మెరైన్ వన్. గంటకు సుమారు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హెలికాప్టర్.. భారీ పేలుళ్లను తట్టుకోగలదు. ఇందులో ఉన్న మూడు ఇంజిన్‌లలో ఒకటి ఫెయిల్ అయినా ఎగరగలదు. ఇలాంటివి ఒకేలా ఉండే ఐదు హెలికాప్టర్లు ఉంటాయి. అధ్యక్షుడు ఎందులో ప్రయాణిస్తున్నాడో శత్రువులకు తెలియకుండా ఇలా ప్లాన్ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత భద్రమైన కారును అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. దీన్ని బీస్ట్ గా పిలుస్తారు. అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారు చేశారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఆయనతో పాటు బీస్ట్ ని కూడా తీసుకెళ్తారు. అమెరికా అధ్యక్షుడితో పాటు వారి కుటుంబ సభ్యులకు 24/7 సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది.

Tags:    

Similar News