Gold Card Scheme: విదేశీ ధనవంతులకు గోల్డ్ కార్డ్స్ అమ్ముతాం - డోనల్డ్ ట్రంప్
What is Gold cards scheme: విదేశీ ధనవంతులకు గోల్డ్ కార్డ్స్ అమ్ముతాం - డోనల్డ్ ట్రంప్
Gold Cards Scheme, it's price and advantages: అమెరికాకు ఆదాయం పెంచుకునేందుకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా గోల్డ్ కార్డ్స్ స్కీమ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల నుండి వచ్చే దిగుమతులపై భారీగా సుంకం రాబడుతున్న ట్రంప్ తాజాగా గోల్డ్ కార్డ్స్ కూడా అమ్ముతాం అంటున్నారు.
ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం బాగా డబ్బున్న విదేశీయులు అమెరికాలో ఈ గోల్డ్ కార్డ్స్ కొనుగోలు చేయవచ్చు. ఒక్కో గోల్డ్ కార్డ్ ధర 50 లక్షల డాలర్లుగా నిర్ణయిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది 43 కోట్ల 53 లక్షలకు సమానం. ఈ గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసిన విదేశీయులకు అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాస హక్కు వచ్చినట్లేనని ట్రంప్ అన్నారు.
అమెరికా అప్పు తీరిపోతుందన్న ట్రంప్
విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఇచ్చే ఈ గోల్డ్ కార్డ్స్ స్కీమ్‌కు మంచి డిమాండ్ ఉంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 10 లక్షల గోల్డ్ కార్డ్స్ అమ్ముడవుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. తద్వారా అమెరికాకు 50 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఆ డబ్బులతో అమెరికా అప్పు మొత్తం త్వరలోనే తీరిపోతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గతేడాది జులై చివరి నాటికి అమెరికా మొత్తం అప్పు 35 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
EB-5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్స్
అమెరికాలో ప్రస్తుతం EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాం అమలులో ఉంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఈ EB-5 వీసా ఇస్తారు. ఇది అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందేందుకు మార్గం ఈజీ చేస్తోంది. అమెరికాలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు అక్కడ ఉపాధి అవకాశాలు పెంపు లక్ష్యంగా ఈ EB-5 వీసా ప్రోగ్రాం తీసుకొచ్చారు. పెట్టుబడి పెట్టే విదేశీయులు ఒక ప్రణాళికతో వస్తే వారికి EB-5 వీసా ఇవ్వడంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఇస్తోంది. EB-5 వీసాతో అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
అయితే, ఇప్పటివరకు ఉన్న ఈ EB-5 వీసా ప్రోగ్రాం స్థానంలోనే ఈ గోల్డ్ కార్డ్స్ స్కీమ్ తీసుకొస్తాం అని డోనల్డ్ ట్రంప్ చెప్పారు. మరో రెండు వారాల్లో ఈ గోల్డ్ కార్డ్స్ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు. గోల్డ్ కార్డ్స్ అమ్మడం మొదలుపెడితే, ట్రంప్ అమెరికా పౌరసత్వాన్ని కూడా అమ్మకానికి పెట్టినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO WATCH THIS VIDEO: New York Grand Central Railway Station: 48 ఎకరాల మాయా ప్రపంచం