US Visa Citizenship Test: యూఎస్‌ వీసా, పౌరసత్వం కోసం పరీక్షలు.. కఠినంగా మారనున్నాయా..?

US Visa Citizenship Test: అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వీసా మరియు పౌరసత్వ విధానాల్లో కఠినతరం దిశగా కొత్త ఆలోచనలు కొనసాగిస్తున్నారు.

Update: 2025-07-26 06:33 GMT

US Visa Citizenship Test: యూఎస్‌ వీసా, పౌరసత్వం కోసం పరీక్షలు.. కఠినంగా మారనున్నాయా..?

US Visa Citizenship Test: అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి వలసల అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వీసా మరియు పౌరసత్వ విధానాల్లో కఠినతరం దిశగా కొత్త ఆలోచనలు కొనసాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం వీసా విధానంలో మార్పులు తీసుకురాబోతున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్‌ అండ్ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్ (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లౌ వెల్లడించారు.

ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎడ్లౌ మాట్లాడుతూ, ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా పౌరసత్వ పరీక్షలు తేలికగా ఉన్నాయన్నారు. ‘‘ఇప్పుడు పరీక్షల్లో ఉండే ప్రశ్నలకు బట్టీ పట్టి చెప్పగలిగే సమాధానాలే ఉంటున్నాయి. పౌరసత్వం మంజూరుకు ముందు వ్యక్తుల దేశభక్తిని, అర్హతను సీరియస్‌గా పరీక్షించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.

అలాగే హెచ్‌-1బీ వీసా వ్యవస్థను అమెరికా ఆర్థికవ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడేలా మళ్లీ పునర్వ్యాఖ్యానం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ తొలి పదవీకాలంలోనే వలస వ్యవస్థలో సంస్కరణల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే తరువాత అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలోకి వచ్చాక వాటిని వెనక్కి తీసుకున్నారు.

ఇదే తరహాలో అమెరికా తాజాగా వలసదారులపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెరిఫికేషన్’ తప్పనిసరి చేసింది. వీసా పొంది అమెరికాలో ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకపోతే, బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారికంగా హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక అమెరికా పౌరసత్వం కోసం కొత్త పద్ధతులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ వినూత్న ప్రతిపాదనగా రియాలిటీ షో రూపంలో అభ్యర్థుల దేశభక్తిని పరీక్షించే కార్యక్రమం నిర్వహించే యోచనపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో పోటీదారులు అమెరికా పట్ల తమ విలువలు, అవగాహన, నిబద్ధతను చాటుకోవాల్సి ఉంటుంది.

ఈ మార్పులన్నీ చూస్తే.. అమెరికా వలస విధానాలు కఠినమైన మార్గంలో సాగనున్నట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News