Dalai Lama: చైనాకు ఝలక్ ఇచ్చిన దలైలామా
Dalai Lama: బౌద్ధ మతగురు దలైలామా కీలక ప్రకటనతో చైనాకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు.
Dalai Lama: చైనాకు ఝలక్ ఇచ్చిన దలైలామా
Dalai Lama: బౌద్ధ మతగురు దలైలామా కీలక ప్రకటనతో చైనాకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు. తన మరణానంతరం తన వారసత్వాన్ని కొనసాగించే హక్కు టిబెటన్ ప్రజలకే ఉంటుందని స్పష్టం చేశారు. జూలై 6న తన 90వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. తదుపరి దలైలామా ఎంపిక బాధ్యత గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’కే ఉన్నదని, మరెవరూ ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోలేరని చెప్పారు.
తన వారసత్వాన్ని కొనసాగించాలా లేదా అనే విషయంపై గతంలో అనేక మంది అభిప్రాయాలు చెప్పినట్లు వెల్లడించిన దలైలామా — అందరూ తమ సంప్రదాయాన్ని కొనసాగించాలనే అభిలాషను వ్యక్తం చేశారని చెప్పారు. గతంలో నుంచే టిబెట్‌ను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దలైలామా వారసుడిగా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసేందుకు చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా టిబెట్ పిల్లలకు బ్రెయిన్‌వాష్ చేయడం, చైనా వలసల్ని అక్కడ పెంచడం వంటి చర్యలు చేపట్టింది.
దలైలామా తాజా ప్రకటన చైనాకు షాక్‌లాంటి వార్తగా మారింది. టిబెట్‌లో ఖనిజ సంపదను తమదిగా చేసుకోవాలనే ఆశతో చైనా ఎప్పటి నుంచో అక్కడ ఆగడాలు సాగిస్తోంది. 1959లో టిబెట్‌లో తిరుగుబాటు విఫలమైన తర్వాత దలైలామా సహా వేలాది మంది టిబెటన్‌లు భారత్‌కు శరణు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వారిలో వారసత్వంపై ఆందోళనలు ఉండగా — తాజా ప్రకటన టిబెటన్ ప్రజలకు ధైర్యం ఇచ్చిందనే చెప్పాలి.
దలైలామా ప్రకటనపై చైనా ప్రభుత్వ ప్రతినిధులు స్పందిస్తూ — తమ అనుమతి లేకుండా దలైలామా వారసుడిని ఎన్నుకోవడం తప్పు అని, ఎంపిక ప్రక్రియ చైనాలోనే జరగాలన్న డిమాండ్ చేశారు. దీనిపై దలైలామా ఘాటుగా స్పందిస్తూ ‘‘దేవుడిని నమ్మని కమ్యూనిస్టులు ఆధ్యాత్మిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి?’’ అంటూ ప్రశ్నించారు. గత సంప్రదాయాన్ని అనుసరిస్తూ తన వారసుడిని టిబెటన్ ప్రజలే ఎన్నుకుంటారని తేల్చిచెప్పారు.