కరోనావైరస్ గురించి మొదట హెచ్చరించిన వైద్యుడి విషాద మరణం

Update: 2020-02-07 03:34 GMT
source : google

ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు కారణమైన కరోనావైరస్ చైనాలోనే 23,000 మందికి సోకింది. 600 మందికి పైగా మరణించారు. అంతకుముందు గతేడాది డిసెంబర్ 30 న చైనా వైద్యుడు లీ వెన్లియాంగ్ కరోనావైరస్ పై తోటి వైద్యులను హెచ్చరించాడు. దీనిపై హెచ్చరిస్తూ సోషల్ నెట్‌వర్క్‌లో SMS లు పంపారు. అయితే అతని హెచ్చరికను అప్పుడు ఎవరూ నమ్మలేదు. అంతేకాకుండా, తప్పుడు వార్తలను వ్యాప్తి చేశారని.. చైనా పోలీసులు అతనికి సమన్లు ​​పంపడమే కాకుండా అదుపులోకి తీసుకున్నారు.

తదనంతరం కరోనావైరస్ వైరస్ ప్రభావం జనవరి చివరిలో బయటపడటం ప్రారంభించింది. తరువాత, చైనా అధికారికంగా కరోనావైరస్ ఉన్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో లీ వెన్లియాంగ్ కరోనావైరస్ బాధితులకు చికిత్స అందించాడు. ఈలోగా అతను కూడా కొరోనావైరస్ బారిన పడినట్లు కొద్ది రోజుల క్రితం వెల్లడైంది. దీంతో అతనికి వరుస చికిత్సలు చేస్తూ వచ్చారు.. దురదృష్టవశాత్తు ఆయన మరణించినట్టు వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ నివేదించింది.

వుహాన్లో "అత్యవసర చికిత్స" అనంతరం లి వెన్లియాంగ్, 34, శుక్రవారం ఉదయం 2.58 గంటలకు చనిపోయినట్లు ప్రకటించారు. అంతేకాదు అతను మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధృవీకరించింది. మరోవైపు అతను హెచ్చరించినా వినకుండా సమస్యను జటిలం చేశారని చైనా ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. నెలరోజుల ముందు హెచ్చరించినా పట్టించుకోకపోవడంపై కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఉందని హెచ్చరించిన వ్యక్తే విషాదకర రీతిలో చనిపోవడం బాధాకరం అని పేర్కొన్నారు.

కాగా చైనాలో కరోనావైరస్ వ్యాప్తి ద్వారా మరణించిన వారి సంఖ్య 636 కు పెరిగిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలిపింది. మొత్తం 73 కొత్త మరణాలలో, 69 కేసులు హుబే ప్రావిన్స్ నుండి నమోదయ్యాయి, ఈ ప్రదేశం వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉంది. ప్రావిన్షియల్ రాజధాని వుహాన్లో 64 కేసులు నమోదయ్యాయి. చైనా దేశవ్యాప్తంగా కొత్తగా 3,143 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం అంటువ్యాధుల సంఖ్య 31,161 వరకు పెరిగింది.

Tags:    

Similar News