Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Khaleda Zia: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు, ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా (80) ఇక లేరు.

Update: 2025-12-30 05:46 GMT

Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

Khaleda Zia: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు, ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా (80) ఇక లేరు. గత నెల నవంబర్ 23న ఊపిరితిత్తులు, గుండె సంబంధిత ఇన్ఫెక్షన్లతో ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేరిన ఆమె, మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.

ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు న్యుమోనియా సోకినట్లు వైద్యులు గుర్తించారు. వృద్ధాప్య సమస్యలతో పాటు డయాబెటిస్, కిడ్నీ, లివర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రతరం కావడంతో ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. నిపుణులైన వైద్య బృందం చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

రాజకీయ ప్రస్థానం - అప్రతిహత విజయం

బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఖలీదా జియాది చెరపలేని ముద్ర. ఆమె తన రాజకీయ జీవితంలో అనేక మైలురాళ్లను అందుకున్నారు. 1991 నుంచి 1996 వరకు, తిరిగి 2001 నుంచి 2006 వరకు ఆమె రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం 'కేర్ టేకర్ గవర్నమెంట్' (మధ్యంతర ప్రభుత్వం) వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది.1981లో తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ హత్య తర్వాత కుప్పకూలిన పార్టీని తన భుజస్కంధాలపై మోసి, శక్తిమంతమైన నాయకురాలిగా ఎదిగారు.

వ్యక్తిగత జీవితం మరియు సవాళ్లు

1945లో జన్మించిన ఖలీదా, 1960లో జియావుర్ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో ఆమె భర్త కీలక పాత్ర పోషించారు. అయితే, ఆమె రాజకీయ ప్రస్థానం పూలబాట ఏమీ కాదు. అవినీతి ఆరోపణల ఎదుర్కొని 2018 నుండి 2020 వరకు జైలు జీవితం గడిపారు. ఆమె ఇద్దరు కుమారులలో ఒకరైన అరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితమే మలేసియాలో మరణించగా, మరో కుమారుడు తారిక్ రెహమాన్ సుమారు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలె బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు.

బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖలీదా జియా చేసిన పోరాటం చిరస్మరణీయం. ఆమె మరణం పట్ల బంగ్లాదేశ్ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News