ఘర్షణల్లో చైనా వైపు భారీ నష్టం

Update: 2020-06-17 06:40 GMT

డ్రాగన్ మరోసారి దొంగదెబ్బ తీసింది. బోర్డర్‌లో తన కుయుక్తిని ప్రదర్శించింది. తూర్పు లఢాక్‌ లోని గాల్వన్ లోయలో భారత్ సైనికులపైకి విరుచుకుపడింది. చైనా సైనికులు మన జవాన్లపై ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఏకంగా 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. వీర మరణం పొందిన వారిలో మన తెలుగోడు తెలంగాణ వాసి కూడా ఉన్నాడు.

గతంలో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య చాలాసార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ సారి జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటనలో సోమవారం జరిగినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆనాడు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సైనికుల మధ్య హోరాహోరీ ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వైపులా సైనికులు తలపడ్డారు. రాళ్లు, ఇనుపరాడ్లు, కర్రలతో ఒకరిపైకి ఒకరు దాడి చేసుకున్నారు. సుమారు 3 గంటల పాటు ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో కల్నల్ సంతోష్‌ బాబుతో సహా ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే వీర మరణం చెందగా మరో 17 మంది జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే అక్కడి వాతావరణం, మంచు, తీవ్రమైన చలి కారణంగా గాయపడ్డ వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 10 మంది వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు మిగతావారి మృతదేహాలను కనుగొనే పనిలో పడింది. మరణించిన వారిలో ఒక కమాండింగ్ అధికారి కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనలో మరణించిన సైనికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇటు ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్లు చెబుతున్నారు. గాయపడ్డిన వారు, మరణించిన వారు కలిపి మొత్తం 43 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఇదే ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల 5 నుంచి రెండు దేశాల సైనికుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అందుకు తగ్గట్లుగానే మనదేశం కూడా భారీగా ఆర్మీని రంగంలోకి దిగింది. అంతలోనే ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు వెనక్కి తగ్గాలని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. కానీ సోమవారం నాటి ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. 1975 తర్వాత ఇండో చైనా బోర్డర్‌లో జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెండు దేశాల సైనిక అధికారులు చర్చలు జరిపినట్లు ఆర్మీ ప్రకటించింది. 

Tags:    

Similar News