చైనాకు అడ్డుగా నిలిచిన 118 మంది వీరులు… దశాబ్దాల తర్వాత వెలుగులోకి వచ్చిన రజాంగ్-లా యుద్ధ గాథ!
1962 Indo-China Warలో రజాంగ్-లా వద్ద పోరాడి వీరమరణం పొందిన 118 మంది భారత జవాన్ల వీరగాథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. Major Shaitan Singh నాయకత్వంలో జరిగిన ఆ మహాయుద్ధం వివరాలు తెలుసుకోండి.
1963 జనవరి 27… దిల్లీ నేషనల్ స్టేడియం. లతా మంగేష్కర్ గొంతు విప్పి పాడిన “ఏ మేరీ వతన్ కే లోగోన్…” పాట విని అక్కడ ఉన్న వేలాది మంది కళ్లలో నీళ్లు తెప్పించుకుంది. చైనా చేసిన ద్రోహయుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారతీయ వీరుల కోసం ఆమె హృదయపూర్వకంగా పాడిన పాట అది. కానీ ఆమె పాడుతున్న సమయంలోనే — ఆ వీరుల్లో కొందరి నిజమైన గాథ మాత్రం మంచు మట్టిలో 16,000 అడుగుల ఎత్తున దాగి ఉంది.
యుద్ధం ముగిశాక నెల రోజులకుంచి — 1963లో లద్ధాఖ్‌లోని రజాంగ్ లా ప్రాంతానికి వెళ్లిన స్థానిక గొర్రెల కాపరి ఒక భయంకర దృశ్యాన్ని చూశాడు. మంచులో గడ్డకట్టిన 100 మందికి పైగా భారత జవాన్ల శరీరాలు… వారి చేతుల్లో ఇప్పటికీ గట్టిగా పట్టుకున్న తుపాకులు… కత్తులు. ప్రతి శరీరంపై తూటాల గాయాలు — కాని ఒక్కరి వెన్ను మీద కూడా గాయం లేదు. అంటే వారు చివరి వరకూ ఎదురెదురుగా నిలిచి పోరాడినట్టు సాక్ష్యం.
అతడు వెంటనే సైన్యానికి సమాచారం ఇచ్చాడు. తదుపరి రోజుల్లో రెడ్ క్రాస్ బృందం, సైనికులు అక్కడికి చేరి ఆ వీరులు 13 కూమావ్ రెజిమెంట్ ‘చార్లీ కంపెనీ’కి చెందిన వారని నిర్ధారించారు — వీరి కమాండర్ మేజర్ షైతాన్ సింగ్ భాటీ.
1962 యుద్ధం నేపథ్యం
1961 నుంచే చైనా లద్ధాఖ్‌లో చొరబాట్లు చేస్తూ వచ్చింది. మరోవైపు “హిందీ-చీని భాయి భాయి” అంటూ పైకి స్నేహం చూపిస్తూ… లోపల మాత్రం యుద్ధానికి సిద్ధమవుతూ వచ్చింది. చివరికి 1962 అక్టోబర్ 20న చైనా మెరుపుదాడి ప్రారంభించింది.
లద్ధాఖ్ రక్షణకూ, లేహ్‌కు మార్గమైన చుషుల్ వ్యాలీ రక్షణకూ కీలకమైన ప్రాంతం రజాంగ్ లా పాస్. ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత—13 కూమావ్ రెజిమెంట్ ‘చార్లీ కంపెనీ’కి అప్పగించారు. ఆయుధాల కొరత… మంచు గాలులు… శీతల ప్రాణాంతక వాతావరణం—ఏమి ఉన్నా వెనక్కి తగ్గని యోధులు వారు.
నవంబర్ 18: యుద్ధం ప్రారంభం
ఉదయం 4:30 గంటలకు చైనా భారీ స్థాయిలో దాడి ప్రారంభించింది. మొదటి దెబ్బను స్వీకరించింది లిజనింగ్ పోస్టులో ఉన్న 4 మంది భారత జవాన్లు.
“వెనక్కి తగ్గం… శత్రువులను ఆపేస్తాం”
హుకుం సింగ్ నేతృత్వంలోని చిన్న బృందం వందలాది చైనా సైనికులపై గట్టిగా దాడి చేసింది. ముగ్గురు వీరమరణం పొందారు, ఒకరు బంధించబడ్డారు.
దీంతో ప్రధాన యుద్ధం ప్రారంభమైంది.
చార్లీ కంపెనీ చివరి శ్వాస వరకు పోరాటం
400 మందితో దాడి చేసిన చైనా సైన్యాన్ని — నాయబ్ సుబేదార్ సూరజ్ నేతృత్వంలోని 7వ ప్లాటూన్ ఎదుర్కొంది. 3 అంగుళాల మోర్టార్లతో కేవలం 20 మంది భారత జవాన్లు — ఒక్క ఫ్లాంకులోనే 130 మందికి పైగా చైనీస్‌ను కూల్చారు.
తర్వాత మందుగుండు అయిపోయినా… చేతితో పోరాడుతూ మరణం వరకూ యుద్ధం కొనసాగించారు.
మేజర్ షైతాన్ సింగ్ — అమర వీరుని చివరి యుద్ధం
మేజర్ షైతాన్ సింగ్ వడివడిగా ప్రతి ప్లాటూన్‌ను సందర్శిస్తూ ధైర్యం నింపారు. పై అధికారులు “వెనక్కి తగ్గండి” అని చెప్పినప్పటికీ — ఆయన బృందం ఒక్క అడుగు వెనక్కి తీసుకోలేదు.
చివరికి తీవ్రంగా గాయపడినప్పటికీ—
తన కాలి దగ్గర లైట్ మిషన్ గన్ కట్టి చివరి బుల్లెట్ వరకూ పేల్చారు.
118 మందిలో 114 మంది వీరమరణం పొందారు. కేవలం 4 మంది మాత్రమే తిరిగివచ్చారు — వారు కూడా ఈ మహాయుద్ధాన్ని దేశానికి తెలియజేయడానికి మాత్రమే.
చైనాకు 500 మందికి పైగా నష్టం జరిగినట్లు అంచనా.
ఈ యుద్ధం తర్వాతే చైనా కాల్పుల విరమణ!
నవంబర్ 18 ఉదయానికి ముగిసిన ఈ యుద్ధం — చైనాను భయపెట్టి… కొన్ని రోజుల్లోనే ఏకపక్ష కాల్పుల విరమణకు నెట్టింది. రజాంగ్ లా యుద్ధం భారత సైన్య చరిత్రలో అతి గొప్ప వీరగాథగా నిలిచిపోయింది.